CWC2023: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం

ఈ ప్రపంచకప్‌లో తొలిసారి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై దక్షిణాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. . చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక వికెట్ తేడాతో ప్రొటీస్ విజయం సాధించింది. అభిమానులందరినీ మునివేళ్లపై నిలబడి చూసిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమితో పాకిస్థాన్ ఈ ప్రపంచకప్‌ను నాకౌట్ చేరకుండానే ముగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది. ఓ దశలో మూడు వందలకుపైగా పరుగులు చేసేలా కనిపించిన బాబర్ సేన ప్రొటీస్ బౌలర్లు పుంజుకోవడంతో 270 పరుగులకే పరిమితమైంది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్ ఆజమ్ 50, సౌద్ షకీల్ 52, షాదాబ్ ఖాన్ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.
31 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన మహ్మద్ రిజ్వాన్‌ను కాట్జే అవుట్ చేశాడు. 65 బంతుల్లో సరిగ్గా 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్‌ను షంషీ అవుట్ చేశాడు. 52 బంతుల్లో 7 ఫోర్లతో 52 పరుగులు చేసి సౌద్ షకీల్ అవుటయ్యాడు. షాదాబ్ ఖాన్ 43, మహ్మద్ నవాజ్ 24 పరుగులతో పర్వాలేదనిపించారు. దీంతో పాక్ 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించేలా కనిపించింది. కానీ పుంజుకున్న ప్రొటీస్ బౌలర్లు వరుసగా వికెట్లను తీశారు. షంషీ నాలుగు, జాన్సన్ 3, కోట్జే రెండు వికెట్లు తీశాడు. దీంతో 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయిన పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది.
అనంతరం 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34 పరుగుల వద్ద భీకర ఫామ్‌లో ఉన్న డికాక్ వికెట్ కోల్పోయింది. బవుమా కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో 67 పరుగులకు ప్రొటీస్ రెండో వికెట్ కోల్పోయింది. వరుసగా వికెట్లు పడుతున్నా మార్‌క్రమ్ పోరాటం ఆపలేదు. మార్‌క్రమ్ ఒంటరి పోరాటంతో దక్షిణాఫ్రికాను విజయం దిశగా నడిపించాడు. 93 బంతుల్లో 91 పరుగులు చేసి జట్టును సునాయసంగా గెలిపించేలా కనిపించాడు. కానీ పాక్ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వరుసగా వికెట్లు తీసి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. ప్రొటీస్‌ను 259కి ఎనిమిది వికెట్లు ఉన్న స్థితికి తెచ్చారు. విజయానికి మరో మూడు పరుగులు అవసమైన దశలో పాక్ మరో వికెట్ తీసింది. ఉత్కంఠ ఊపేస్తున్న వేళ కేశవ్ మహరాజ్ బౌండరీ బాది సఫారీ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ ఓటమితో పాక్ సెమీస్ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com