WTC2025: తొలి అడుగు దక్షిణాఫ్రికాదే

దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2025 చేరిన మొట్టమొదటి సఫారీ జట్టు ఆవిర్భవించింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరడం కూడా ఇదే తొలిసారి. ఇక రెండో స్థానం కోసం ప్రస్తుతానికి మూడు జట్లు పోటీ పడుతోన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్లకు ఆ అవకాశం ఉంది.
ఉత్కంఠభరిత విజయం
సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది దక్షిణాఫ్రికా. రెండు వికెట్ల తేడాతో పాక్‌ను మట్టికరిపించింది. గెలవడానికి అవసరమైన 147 పరుగులను అతి కష్టం మీద ఛేదించింది. ఎనిమిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్ నైట్ స్కోరు 27/3తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. మార్‌క్రమ్ (37; 63 బంతుల్లో), తెంబా బావుమా (40; 78 బంతుల్లో) రాణించడంతో సునాయసంగా విజయం సాధించేలా కనిపించింది. ఒక దశలో 93/4 స్కోరుతో మెరుగైన స్థితిలో ఉన్న సఫారీల జట్టు.. కాసేపటికే 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఈ క్రమంలో టెయిలెండర్ కగిసో రబాడ (31*; 26 బంతుల్లో 5 ఫోర్లు)నికార్సైన బ్యాటర్‌లా మారిపోయి జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. మార్కో యాన్సెన్ (16; 24 బంతుల్లో 3 ఫోర్లు) అతడికి సహకరిస్తూ విన్నింగ్ షాట్ కొట్టాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com