SRH: బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తున్న హెచ్సీఏ

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బాంబు పేల్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒత్తిడి ఎదుర్కోలేక, వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ నగరాన్ని విడతామని సన్ రైజర్స్ యాజమాన్యం బాంబు పేల్చింది. ఐపీఎల్ మ్యాచ్‌ల ఫ్రీ పాస్‌ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఫ్రాంచైజీ ఆరోపిస్తోంది. ఓ ఐపీఎల్ మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కి తాళాలు వేశారని సన్ రైజర్స్ యాజమాన్యం వెల్లడించింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్‌మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. దీన్ని సంఘం దృష్టికి కూడా తీసుకొచ్చామని, అధ్యక్షుడి ప్రవర్తనను బట్టి చూస్తే ఈ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడటం ఇష్టం లేనట్లుగా ఉందని తెలిపింది. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఐపీఎల్ ఉచిత పాసుల కోసం వేధిస్తున్నారని హెచ్సీఏ కోశాధికారికి SRH ప్రతినిధి లేఖ రాయడం సంచలనం రేపింది.
అసలు ఆ లేఖలో ఏముందంటే.. ?
ఐపీఎల్ ఉచిత టికెట్ ఫ్రీ పాస్ ల కోసం హెచ్సీఏ బెదిరింపులు బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక ఈ లేఖ రాస్తున్నామని లేఖలో పేర్కొంది. ఒప్పందం ప్రకారం హెచ్‌సీఏకు సన్‌రైజర్స్ 10 శాతం (3900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తోంది. 50 సీట్ల సార్థ్యం ఉన్న ఎఫ్12ఏ కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది సామర్థ్యం 30 మాత్రమేనని, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని హెచ్‌సీఏ అడినట్లు తెలిసింది. ఈ విషయంపై మాట్లాడదామని చెప్పాము. కానీ గత మ్యాచ్ సమయంలో ఎఫ్3 బాక్స్ కి హెచ్ సి ఏ తాళాలు వేసింది. తమకు అదనంగా 20 టికెట్లు కేటాయిస్తే తప్ప తెరవమని హెచ్చరించారు. హెచ్‌సీఏ ఇలాగే ప్రవర్తిస్తే బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్‌సీఏతో కలిసి పని చేస్తున్నామని, గత రెండేళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయంది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాట్లు చేయాలని ఎస్ఆర్‌హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఈ ఏడాదే చాలాసార్లు మా వారిని బెదిరించారు. ఇది ఏమాత్రం సహించరానిది. మేము స్టేడియంకు అద్దె చెల్లిస్తున్నాము. ఐపీఎల్ సమయంలో స్టేడియం మా ఆధీనంలో ఉండాలి అని శ్రీనాథ్ తన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.
పలుమార్లు బెదిరింపులు
మ్యాచ్ సమయంలో ఇలా బ్లాక్ మెయిలింగ్ చేయడం, టికెట్ల కోసం వేధించడం కరెక్ట్ కాదు. ఇలా సమన్వయం లేకుండా పనిచేయాలంటే కష్టం. హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఏడాది పలుమార్లు తమను బెదిరించారని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com