SRI CHARANI: కడప నుంచి.. విశ్వ విజేత వరకు..

ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఎర్రమల్లె గ్రామానికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి.. భారత మహిళల జట్టులో మెరిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఈ చారిత్రక విజయంలో, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా నుంచి వచ్చిన యువ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి ప్రదర్శన క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. తన తొలి ప్రపంచ కప్‌లోనే అత్యంత కీలక పాత్ర పోషించి, కడప అమ్మాయి దేశం గర్వించేలా చేసింది.
మారుమూల గ్రామం నుంచి
కడప జిల్లాలోని వీరపునాయిని మండలం ఎర్రమల్లె గ్రామం నుంచి వచ్చిన నల్లపురెడ్డి.శ్రీ చరణి..భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించింది.ఆంధ్రప్రదేశ్ నుంచి పురుషుల లేదా మహిళల క్రికెట్లో ప్రపంచ కప్‌లో ఆడిన మొట్టమొదటి క్రీడాకారిణిగా నిలిచింది. కానీ,ఆమె ప్రయాణం అనేక కష్ట నష్టాల మధ్య సాగింది.21 ఏళ్ల ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ క్రికెట్లోకి చాలా ఆలస్యంగా అడుగుపెట్టింది.వాస్తవానికి క్రికెట్ ఆమె మొదటి లక్ష్యం కాదు. చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ, అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపింది.అయితే 16 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆమె క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి ఆమె మావయ్య కిషోర్ కుమార్ రెడ్డి ప్రధాన కారణం.ఆమె క్రికెట్‌ను ఎంచుకోకపోవడానికి ప్రధాన అడ్డంకులు ఆర్థిక సమస్యలు, కుటుంబం నుంచి మొదట్లో వచ్చిన వ్యతిరేకత. ఆమె తండ్రి చంద్రశేఖర్ రెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో చిన్న ఉద్యోగిగా పనిచేసేవారు.క్రికెట్ జట్టు ఎక్కువగా పురుషుల క్రీడ కావడంతో ఆమె తండ్రి మొదట్లో చరణి నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. తండ్రిని ఒప్పించడానికి ఆమెకు ఏడాది కాలం పట్టింది.చరణి చెప్పిన ప్రకారం.. ఆమె క్రీడా జీవితాన్ని ప్రారంభించే సమయంలో తన కుటుంబం అప్పులతో బాధపడేది. అయినప్పటికీ ఆ కష్టాలు తన ఆటపై ప్రభావం చూపకుండా ఆమె తల్లిదండ్రులు సహకరించారు.
అద్భుత ప్రదర్శన..
21 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అయిన శ్రీ చరణికి ఇది అంతర్జాతీయ క్రికెట్లో కేవలం తొలి అడుగు మాత్రమే. ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంకపై వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆమె, ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో ఏమాత్రం బెదరకుండా, ఒత్తిడిని అధిగమించి ఆడింది. ప్రపంచ కప్‌లో భారత బౌలర్లలో దీప్తి శర్మ (22 వికెట్లు) తర్వాత అత్యధికంగా 13 వికెట్లు తీసిన రెండో బౌలర్ శ్రీ చరణి. వికెట్లు తీయడమే కాకుండా, తన కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ-ఫైనల్లో భారత బౌలర్లు పరుగులు సమర్పించుకుంటున్న సమయంలో, శ్రీ చరణి తన 10 ఓవర్ల స్పెల్‌లో కేవలం 4.90 ఎకానమీతో 49 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీసింది. ఆమె బౌలింగ్ ఆసీస్ దూకుడుకు కళ్లెం వేసి, విజయాన్ని సాధించిపెట్టడంలో కీలకమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

