SMRITI: స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన పెళ్లి రద్దు చేసుకున్నారు. వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఆమె తన పూర్తి దృష్టిని దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవడంపైనే పెడతానని ప్రకటించారు. అటు పలాష్ ముచ్చల్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ, నిరాధారమైన వదంతులను ఖండించారు. అభిమానులు ఆమె నిర్ణయానికి మద్దతునిస్తున్నారు.
స్మృతి మాటల్లో..
‘‘కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సమయంలో మాట్లాడటం, స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యమని నాకు అనిపించింది. నేను నా జీవితం ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునే వ్యక్తిని. అయితే నా పెళ్లి రద్దు అయిందని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. నేను ఈ పెళ్లి అంశాన్ని ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నాను. దయచేసి మా ఇద్దరి కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాను. నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్నాను. సాధ్యమైనంతవరకు దేశం తరపున ఆడి ట్రోఫీలు గెలవాలని కోరుకుంటాను. నా ఫోకస్ అంతా ఇక దానిపైనే ఉండబోతోంది’’ అని స్మృతి స్పష్టం చేశారు. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతా. భారత్ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు గెలుస్తా. నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’ అని స్మృతి స్పష్టం చేశారు.
ముందుకు వెళ్తా : పలాశ్
‘‘నేను జీవితంలో ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాను. నా వ్యక్తిగత సంబంధం నుంచి బయటకు వచ్చాను. ఆధారాల్లేని వదంతులను సులభంగా నమ్మేస్తున్న వారిని చూసి తట్టుకోవడం కష్టంగా ఉంది. ఇది నా జీవితంలో అత్యంత కష్టకాలం. సోర్స్ ఎవరో, ఏంటో ఎప్పటికీ తెలియని వదంతుల ఆధారంగా ఎవరినైనా జడ్జి చేసే సమయంలో.. ఈ సమాజం ఒక్కసారి ఆగి ఆలోచించాలి. ఇలాంటి అంశాల్లో మన మాటలు అవతలి వ్యక్తిని గాయపరుస్తాయనే విషయాన్ని గుర్తించాలి. నా ప్రతిష్ఠకు భంగం కలిగించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినవారిపై మా లీగల్ టీమ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. ఈ కష్ట సమయంలో నా పక్షాన నిలిచినవారికి ధన్యవాదాలు’’
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

