Steve Smith-MLC: అమెరికా లీగ్ క్రికెట్‌లో ఆడనున్న స్మిత్..?

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అమెరికాలో జరగనున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో ఆడనున్నాడా...? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అమెరికా లీగ్(MLC)లోని వాషింగ్టన్ ఫ్రీడం జట్టుకి ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటానికి స్టీవ్ స్మిత్ (Steve Smith) తో ఆ జట్టు ఒప్పందం కుదుర్చుకుంది. శుక్రవారం నుంచి లీగ్‌లు ఆరంభమవనున్నాయి.
ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్మిత్, వాషింగ్టన్ ఫ్రీడం(Washington Freedom) జట్టుకు ఈ సీజన్ కాకుండా వచ్చే సీజన్‌లో ఆడే అవకాశాలున్నాయి. న్యూ సౌత్ వేల్స్, వాషింగ్టన్ ఫ్రీడం జట్ల మధ్య సంబంధాలు చాలా బాగుండటమే కారణం. వేల్స్ జట్టు హెడ్ కోచ్ మైఖేల్ క్లింగర్, గ్రెగ్ షెపర్డ్‌లు ఈ జట్టులోనూ అదే స్థానాల్లో కొనసాగుతున్నారు.
వాషింగ్టన్ జట్టుతో భాగస్వామ్యంపై స్మిత్ మాట్లాడుతూ.. న్యూసౌత్ వేల్స్ నుంచి వచ్చిన ఆటగాడిగా ఈ జట్టుతో భాగం కావడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. ఆస్ట్రేలియాలో క్రికెట్‌కి ఘనమైన చరిత్ర ఉంది. దీనిని నేను అమెరికాకు తీసుకురావడంలో భాగం కావాలనుకుంటున్నానని వెల్లడించాడు.
హెడ్ కోచ్ క్లింగర్ మాట్లాడుతూ.. స్టీవ్ స్మిత్ రాకతో ఫ్రీడం జట్టు హై ప్రొపైల్ జట్టుగా మారుతుందన్నాడు. స్మిత్‌తో ఆడిన హెన్రిక్స్ వంటి వేల్స్ ఆటగాళ్లు ఇక్కడా ఆడుతున్నారు. స్మిత్ వంటి ఆటగాడు మా జట్టుని ప్రమోట్ చేయడం మాకు గర్వకారణం, అతనితో దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తాం అని వెల్లడించాడు.
2024లో విండీస్, అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత జరిగే అమెరికా లీగ్ 2వ సీజన్లో స్మిత్ ఆడే అవకాశాలున్నాయి. ఎందుకంటే వరల్డ్‌కప్ జూన్‌లో ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాకు ఏ దేశంతోనూ మ్యాచ్‌లు లేవు. జులై మొత్తం విరామం తీసుకుని, ఆగస్టులోనే ఆ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆ విరామ సమయంలో స్మిత్ ఆడే అవకాశాలున్నాయి.
6 జట్లతో ఆరంభమవనున్న మేజర్ లీగ్ క్రికెట్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభమవనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com