Sunil Chhetri: రొనాల్డో, మెస్సీ తర్వాత అతనే... హ్యాపీ బర్త్‌డే సునీల్ ఛెత్రీ

Sunil Chhetri: రొనాల్డో, మెస్సీ తర్వాత అతనే... హ్యాపీ బర్త్‌డే సునీల్ ఛెత్రీ
భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక, ఉత్తమ ఆటగాడికి ఇచ్చే రాజీవ్ ఖేల్‌ రత్న అవార్డును 2021 సంవత్సరంలో అందుకున్నాడు. 2011 లో అర్జున అవార్డుతో సత్కరించింది.

Sunil Chhetri:భారత ఫుట్‌బాల్‌ని 2 దశాబ్ధాలుగా ఒక్కడే మోస్తున్న సునీల్‌ ఛెత్రీ నేడు తన 39వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాలుగా భారత ఫుట్‌బాల్‌కు అతనే ముఖచిత్రంగా ఉంటూ వస్తున్నాడు. భారత జట్టుకు ఎన్నో అద్భుత ప్రదర్శనలు చేసి మరపురాని విజయాలు అందిస్తూ, ఫుట్‌బాల్ ప్రపంచంలో భారత జట్టు ఎదిగేందుకు తోడ్పడుతున్నాడు.

ప్రపంచ ఫుట్‌బాల్‌లో మేటి ఫుట్‌బాల్ ప్లేయర్స్ పోర్చుగల్‌కి చెందిన క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీల తర్వాత అత్యధిక గోల్స్‌ కొట్టిన రికార్డ్ సునీల్‌ ఛెత్రీ పేరు మీదనే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇటీవలె ఇంటర్‌ కాంటినెంటల్‌ ఛాంపియన్‌ షిప్, శాఫ్ కప్‌లు అందించి ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో మొదటి సారి భారత్‌ను 100 లోపు ర్యాంకులోకి తెచ్చాడు.

భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక, ఉత్తమ ఆటగాడికి ఇచ్చే రాజీవ్ ఖేల్‌ రత్న అవార్డును 2021 సంవత్సరంలో అందుకున్నాడు. 2011లో అర్జున అవార్డుతో సత్కరించింది.


భారత్‌ తరపున తను ఆడిన 142 అంతర్జాతీయ మ్యాచుల్లో 92 గోల్స్ కొట్టి రొనాల్డో(123, 200 మ్యాచులు), మెస్సీ(103, 175 మ్యాచులు)ల తర్వాతి స్థానంలో నిలిచాడు. భారత్ జట్టుకు 2008లో ఎఎఫ్‌సీ ఛాలెంజ్ కప్ గెలిపించాడు. అలాగే 2011, 2015, 2021, 2023 సంవత్సరాల్లో శాఫ్ ఛాంపియన్‌షిప్‌లు అందించి దక్షిణాసియాలో భారత్‌కు తిరుగులేని ఆధిపత్యం అందించాడు. 2018, 2023 సంత్సరాల్లో భారత జట్టు ఇంటర్‌ కాంటినెంటల్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే 2007, 2009, 2012 సంవత్సరాల్లో నెహ్రూ కప్‌లను గెలిచాడు.

2001-02 సీజన్‌లో ఢిల్లీ క్లబ్ తరఫున ఆరంగేట్రం చేశాడు. 2002లో ప్రతిష్ఠాత్మక మోహన్ బగాన్ టోర్నీలో మొదటిసారిగా పాల్గొని, 18 గోల్స్ చేసి క్లబ్‌ తరపున 2005 వరకు కొనసాగాడు.

తర్వాత 2005-08 వరకు JCT, 2008-09లో ఈస్ట్ బెంగాల్, 2009-10లో డెంపో, 2011లో చిరాగ్ యునైటెడ్, 2011-12లో మోహన్ బగాన్, 2013లో చర్చిల్ బ్రదర్స్ తరపున ఆడాడు. 2013 నుంచి ఇప్పటిదాకా బెంగళూరు క్లబ్ జట్టుతో కొనసాగుతున్నాడు.

క్లబ్ ఫుట్‌బాల్‌లో ఛెత్రీ ఘనతలు ఎక్కువగా బెంగళూరు తరఫున ఆడుతూ సాధించాడు. ఆ జట్టుకు I లీగ్(2013-14, 2015-16), ఇండియన్ సూపర్ లీగ్(2018-19), ఫెడరేషన్ కప్(2014-15, 2016-17), సూపర్ కప్(2018), డ్యూరాండ్ కప్‌(2022)లు సాధించిపెట్టాడు.

Tags

Read MoreRead Less
Next Story