CHEETRI: భారత ఫుట్‌బాల్‌లో ముగిసిన సునీల్ ఛెత్రీ శకం

టీమ్‌ఇండియా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో భాగంగా గురువారం తన చివరి మ్యాచ్ కువైట్‌తో ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. తమ అభిమాన ఆటగాడికి వీడ్కోలు పలికేందుకు అభిమానులు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఛెత్రికి చెందిన 11 నంబర్ జెర్సీ ధరించి, సునీల్.. సునీల్ అంటూ వారంతా మైదానాన్ని హోరెత్తించారు. భార్య సోనమ్, తొమ్మిది నెలల కుమారుడు స్టాండ్స్‌లో నిలబడి అతడిని ఉత్సాహపరిచారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న ఛెత్రీని సహచర ఆటగాళ్లు ఓదార్చారు. అనంతరం గార్డ్ ఆఫ్ హానర్‌తో వీడ్కోలు పలికారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే, బెంగాల్ క్రీడాశాఖ మంత్రి అరుప్ భట్టాచార్య అతడికి శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఇరాన్ లెజెండ్ అలీ డేయ్, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీతర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా ఛెత్రీ ఉన్నాడు.
జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌బాలర్స్ జాబితాలో ఛెత్రి నాలుగో స్థానంలో ఉన్నాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్; 206 మ్యాచ్‌ల్లో 128 గోల్స్), అలీ దాయ్ (ఇరాన్; 149 మ్యాచ్‌ల్లో 109 గోల్స్); లయనెల్ మెస్సీ (అర్జెంటీనా; 180 మ్యాచ్‌ల్లో 106 గోల్స్) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. ఆసియా క్వాలిఫయర్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రస్తుతం ఖతర్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... భారత్, అఫ్గానిస్తాన్ జట్లు నాలుగు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.
19 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్‌లో కొనసాగిన సునీల్ ఛెత్రీకి శుభాకాంలంటూ ఫిఫా ట్వీట్ చేసింది. కువైట్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే ఫిఫా ఈ ట్వీట్ చేసింది. 94 అంతర్జాతీయ గోల్స్ చేసి.. ఒక దేశం ఆశలను ముందుకు తీసుకెళ్లిన ఆసియా ఫుట్‌బాల్ ఐకాన్, సునీల్ ఛెత్రికి ధన్యవాదాలంటూ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) ట్వీట్ చేసింది. ఛెత్రీని అద్భుతమైన కెరీర్‌కు అభినందిస్తూ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఏ లక్ష్యాన్ని సాధించడం సులభం కాదని.... 94 అంతర్జాతీయ గోల్స్‌తో భారత కీర్తిపతాకను ఛెత్రీ ఎగరవేశారని సచిన్ ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన కెరీర్‌ను దేశానికి అందించినందుకు సునీల్ ఛెత్రికి సచిన్ ధన్యవాదాలు తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com