ipl: ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అవుట్..!

ipl: ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు నుంచి సన్‌రైజర్స్ అవుట్..!
X
గుజరాత్ చేతిలో ఘోర పరాజయం

ఐపీఎల్‌ 18వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్ ఆశలకు దాదాపు తెరపడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో హైదరాబాద్... గుజరాత్‌ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 38 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ 224 పరుగులు చేసింది. 225 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ 186 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ బ్యాటర్లు రాణించారు. శుభ్‌మన్‌ గిల్‌ (76: 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్‌ బట్లర్‌ (64: 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), సాయి సుదర్శన్‌ (48: 23 బంతుల్లో 9 ఫోర్లు) చెలరేగడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. హైదరాబాద్‌ బౌలర్లలో ఉనద్కత్‌ 3, కమిన్స్‌, అన్సారీ తలో వికెట్‌ తీశారు. అనంతరం బరిలోకి దిగిన హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులకే పరిమితం అయింది. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (74: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగినా, మిగతావారు విఫలం కావడంతో ఆజట్టు గెలుపు తీరాలకు చేరలేకపోయింది. క్లాసెన్‌ (23: 18 బంతుల్లో 1 ఫోర్లు, ఒక సిక్స్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (21*: 10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌ (19*: 10 బంతుల్లో 1 ఫోర్లు, ఒక సిక్స్‌) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ 2, సిరాజ్‌ 2, ఇషాంత్‌ శర్మ, కొయిట్జీ తలో వికెట్‌ తీశారు.

Tags

Next Story