T 20 WORLD CUP: అఫ్గాన్‌ను చిత్తు చేసిన టీమిండియా

T 20 WORLD CUP: అఫ్గాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
X
47 పరుగుల తేడాతో ఘన విజయం... మెరిసిన సూర్య, బుమ్రా

టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ ఎయిట్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. కెన్సింగ్‌టన్‌ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 8 పరుగులే చేసిన రోహిత్‌... ఫరూకీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విరాట్‌ కోహ్లీ పంత్‌తో కలిసి కోహ్లీ రెండో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 24 బంతుల్లో 24 పరుగులు చేసిన విరాట్‌ను రషీద్‌ ఖాన్‌ అవుట్‌ చేశాడు. 11 బంతుల్లో 20 పరుగులు చేసిన రిషబ్‌ పంత్‌ను కూడా రషీద్‌ ఖాన్‌ అవుట్‌ చేశాడు. దూబేను కూడా రషీద్‌ ఖాన్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మూడు వికెట్లు తీసిన రషీద్‌ ఖాన్‌ భారత్‌పై ఒత్తిడి పెంచాడు. అయితే 90 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు సూర్య- హార్దిక్‌ మంచి స్కోరు అందించారు. ఉన్నంతసేపు చూడముచ్చని షాట్లతో సూర్య అలరించాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 53 పరుగులు చేసి సూర్యా అవుటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా 24 బంతులు ఆడి మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా ఏడు పరుగులే చేసి పెవిలియన్‌ చేరడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 3, ఫరూకీ 3 వికెట్లు తీశారు.


182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. అఫ్గాన్‌ 13 పరుగుల వద్ద మొదటి వికెట్‌ కోల్పోయింది. రహ్మతుల్లా గుర్బాజ్‌ను అవుట్ చేసిన స్టార్‌ పేసర్‌ బుమ్రా భారత్‌కు శుభారంభం అందించాడు. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ను అక్షర్‌ అవుట్‌ చేయడంతో 23 పరుగుల వద్ద అఫ్గాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అయితే ఇదే స్కోరు వద్ద మరో వికెట్‌ తీసిన బుమ్రా అఫ్గాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేశాడు. నాలుగు బంతుల్లో రెండు పరుగులు చేసిన జజాయ్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. దీంతో అదే 23 పరుగుల వద్ద అఫ్గాన్‌ మూడో వికెట్ కోల్పోయింది. 67 పరుగుల వద్ద అఫ్గాన్ నాలుగో వికెట్‌కు కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. నబీ 14, రషీద్‌ ఖాన్‌ 2, నూర్‌ అహ్మద్‌ ఆరు, నవీనుల్‌ హక్‌ డకౌట్‌ కావడంతో అఫ్గాన్‌ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో రోహిత్‌ సేన 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా నాలుగు ఓవర్లలో ఏడు పరుగులే ఇచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. అర్ష్‌దీప్‌3, కుల్‌దీప్‌ రెండు వికెట్లు తీశారు.

Tags

Next Story