T20 WORLD CUP: పాకిస్థాన్ ను వణికించిన నెదర్లాండ్స్

అంచనాలకు అందని విధంగా నెదర్లాండ్స్ జట్టు ఉత్కంఠభరిత పోరాటం సాగించినప్పటికీ, చివరకు అనుభవం ముందు తలవంచక తప్పలేదు. నిర్ణీత 20 ఓవర్ల మ్యాచ్‌లో పాకిస్థాన్ మూడు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ దాదాపు సంచలనం సృష్టించే స్థాయిలో పాకిస్థాన్‌ను ఓడించే దాకా తీసుకెళ్లింది.ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. అతనికి తోడుగా బాస్ డీ లీడే (30), మైఖేల్ లెవిట్ (24), కోలిన్ అకెర్మాన్ (20) కొంత ప్రతిఘటన చూపించారు. అయితే మిగతా బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు.
పాకిస్థాన్ బౌలింగ్ విభాగంలో సల్మాన్ మీర్జా మూడు వికెట్లతో రాణించాడు. నవాజ్, అబ్రార్, సయీమ్ అయూబ్ తలో రెండు వికెట్లు తీసుకోగా, షాహీన్ అఫ్రిది ఒక వికెట్ సాధించాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఆరంభంలోనే ఒత్తిడిలో పడింది. ఒక దశలో 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఓపెనర్ ఫర్హాన్ 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయూబ్ 24 పరుగులతో సహకరించినా, మధ్య క్రమ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఈ సమయంలో ఫహీమ్ అష్రఫ్ అద్భుతంగా ఆడాడు. 11 బంతుల్లో 29 పరుగులు చేస్తూ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో జట్టును గెలుపు దిశగా నడిపించాడు. చివరి ఓవర్లలో అతని దూకుడు బ్యాటింగ్ పాకిస్థాన్‌ను ఓటమి నుంచి బయటపడేలా చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ తలో రెండు వికెట్లు తీశారు. లోగాన్ వాన్ బీక్, కైల్ క్లైన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో ఒక వికెట్ సాధించారు. మ్యాచ్ అంతా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన నెదర్లాండ్స్, చివరి ఓవర్లలో అనుభవ లోపంతో ఎక్కువ పరుగులు ఇచ్చింది. ముఖ్యంగా 19వ ఓవర్లో లోగాన్ వాన్ బీక్ ఇచ్చిన 24 పరుగులు మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేశాయి. చివరకు పాకిస్థాన్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. అయితే ఈ మ్యాచ్ నెదర్లాండ్స్ పోరాట స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. ఈ పసికూన జట్టు మరో అడుగు ముందుకేస్తే, భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు తప్పక సృష్టించగలదనే నమ్మకాన్ని ఈ మ్యాచ్ కలిగించింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
