T20 WORLD CUP: బ్యాట్‌తో దంచేశారు..బాల్‌తో కూల్చేశారు

టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టు తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A పోరులో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య మెరుపులు మెరిపించగా, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మాయాజాలం ప్రదర్శించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ అదిరే ఆరంభాన్ని అందించాడు. కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని ఊపేశాడు. 24 బంతుల్లో 61 పరుగులు (6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన కిషన్, బౌండరీల వర్షం కురిపించాడు. మరోవైపు తుది జట్టులోకి వచ్చిన సంజు శాంసన్ వేగవంతమైన 22 పరుగులు చేశాడు. తిలక్ వర్మ, శివమ్ దూబే కూడా మంచి ఆరంభాలు ఇచ్చారు.
7 ఓవర్లకే భారత్ స్కోరు 104/1కి చేరుకోవడం ఇన్నింగ్స్ దూకుడుకు నిదర్శనం. అయితే 300 పరుగులు కూడా సాధ్యమే అనిపించిన దశలో అనూహ్యంగా భారత్ తడబడింది. 20 పరుగుల వ్యవధిలో ఇషాన్, సూర్యకుమార్, తిలక్ వికెట్లు కోల్పోయింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి భారత్ వేగాన్ని కట్టడి చేశాడు. మధ్య ఓవర్లలో బాధ్యత తీసుకున్న హార్దిక్ పాండ్యా అర్ధశతకంతో జట్టును నిలబెట్టాడు. 28 బంతుల్లో 52 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి చివరివరకు పోరాడాడు. చివర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
స్పిన్ మాయాజాలం
210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధాటిగా ఆడింది. 9 ఓవర్లకు 85/2తో భారత్‌కు సవాలు విసిరింది. ఓపెనర్లు స్టీన్‌క్యాంప్ (29), ఫ్రైలింక్ (22) ఆకట్టుకున్నారు. కానీ అర్షదీప్ సింగ్ ఫ్రైలింక్‌ను ఔట్ చేయడంతో పతనం ప్రారంభమైంది. అక్కడి నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మాయాజాలం ప్రదర్శించారు. వరుణ్ చక్రవర్తి 3/7తో ప్రత్యర్థి జట్టును గజగజ వణికించాడు. కీలక సమయంలో వరుస వికెట్లు తీసి నమీబియా వెన్ను విరిచాడు. అక్షర్ పటేల్ 2/20తో రాణించగా, హార్దిక్ పాండ్య కూడా 2 వికెట్లు సాధించాడు. బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు. 30 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లు కోల్పోయిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-Aలో అగ్రస్థానాన్ని బలపరిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమన్వయం కనిపించడం జట్టుకు సానుకూల సంకేతం. అయితే ఆరంభ దూకుడును పూర్తి ఇన్నింగ్స్ పాటు కొనసాగించలేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. భారత్ తన తదుపరి మ్యాచ్‌లో ఆదివారం పాకిస్థాన్‌ను ఢీకొననుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
