T20 WORLD CUP: జిం"బాబోయ్".. శ్రీలంకకు బిగ్ షాక్

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టు మరోసారి తన సత్తా చాటింది. గ్రూప్ దశను అగ్రస్థానంలో ముగిస్తూ సంచలన ప్రదర్శన చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై విజయం సాధించిన జింబాబ్వే, లీగ్ దశ చివరి మ్యాచ్‌లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి సూపర్-8కు అజేయంగా చేరుకుంది. ఈ విజయంతో జింబాబ్వే జట్టు టోర్నీలో గట్టి పోటీదారుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక అద్భుతంగా ఆడి 62 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవన్ రత్నాయకే 44 పరుగులతో మంచి సహకారం అందించగా, కుశాల్ పెరీరా 22 పరుగులు చేశాడు. అయితే కుశాల్ మెండిస్ (14), కమిందు మెండిస్ (7), డాసున్ శనక (6) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని, గ్రీన్ క్రెమెర్, ఇవాన్స్ తలో రెండు వికెట్లు తీశారు. బర్ల్ ఒక వికెట్ సాధించాడు.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం జట్టును విజయదిశగా నడిపింది. బ్రియాన్ బెనెట్ 63 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. సికందర్ రజా 45 పరుగులతో దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దరూ కలిసి 40 బంతుల్లోనే 69 పరుగులు జోడించి మ్యాచ్‌ను జింబాబ్వే వైపు తిప్పారు. 19వ ఓవర్లో హేమంత రెండు వికెట్లు తీసి కొంత ఉత్కంఠ రేపినా, మున్యాంగా (8*) బెనెట్‌కు తోడుగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శ్రీలంక బౌలర్లలో హేమంత రెండు వికెట్లు, వెల్లలాగే మరియు శనక తలో వికెట్ సాధించారు.
మొత్తం నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వే అజేయంగా సూపర్-8లోకి అడుగుపెట్టింది. పెద్ద జట్లను సైతం ఓడిస్తూ వస్తున్న ఈ జట్టు ఇప్పుడు టీమ్ ఇండియాకు కూడా గట్టి సవాల్‌గా మారింది. సూపర్-8 దశలో జింబాబ్వే భారత్ గ్రూప్‌లో ఉండడం విశేషం. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో పాటు జింబాబ్వే కూడా గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 26న భారత్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
