TANVI SHARMA: భవిష్యత్ ఆశా కిరణం తన్వి శర్మ

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. దాదాపు పదిహేడేళ్ల క్రితం సైనా నెహ్వాల్ స్వర్ణం సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ టోర్నీలో భారత్ మహిళల వ్యక్తిగత విభాగంలో ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది. ఆ ఏడాదే పుట్టిన తన్విశర్మ అదిరే ఆటతో తనకన్నా మెరుగైన షట్లర్లను దాటి ఇదే టోర్నీలో రజితం గెలిచింది. పతకం గెలిచి సైనా సరసన నిలిచింది. ప్రపంచ జూనియర్ టోర్నీలో పతకం గెలవడం ద్వారా భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది తన్విశర్మ.
పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌కు చెందిన తన్వికి ఆటలంటే చాలా ఇష్టం. ఇందుకు కుటుంబ నేపథ్యం కూడా ఓ కారణం. తన్వి తల్లి మీనా శర్మ వాలీబాల్ ప్లేయర్. కానీ ఆమె తన కుమార్తెకు రాకెట్ ఇచ్చింది. తాను వాలీబాల్ ఆడే డీసీ కాంప్లెక్స్‌లోనే తన్వి బ్యాడ్మింటన్‌లో పట్టు సాధించేందుకు కృషి చేసింది. ఉపాధ్యాయుడైన తండ్రి వికాశ్ శర్మ కూడా కుమార్తెను ఎంతో ప్రోత్సహించాడు. సోదరి రాధికతో కలిసి తన్వి సాధన చేసేది. సైనా నెహ్వాల్, పి.వి.సింధులను ఎంతో ఇష్టపడే ఈ అమ్మాయి వారి ఆటనే గమనించి బ్యాడ్మింటన్‌లో మరింత మెరుగైంది. కానీ ఈ ఆట అంటే విపరీతమైన పోటీ.. ఖర్చు కూడా.! అయినా తన్వి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా అంతర్జాతీయ ప్లేయర్ కావాలనే పట్టుదలతో 2016లో హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో చేరింది. అయిదేళ్లు ఇక్కడే ఉండి ఆటలో రాటుదేలింది. చాలా ఏళ్లు ఇంటికి దూరం కావడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బ్యాడ్మింటన్‌లో ఎదగడం కష్టమేమో అనుకుంది. ఆట బాగానే ఉన్నా.. మానసిక ఒత్తిడి కారణంగా ఏకాగ్రత కోల్పోయేది. కోచ్‌ల ప్రోత్సాహంతో మళ్లీ గాడిలో పడిన తన్వి.. అంతర్జాతీయ తెరపై సత్తా చాటుతోంది. అండర్-13లో భారత నంబర్‌వన్‌గా ఎదిగిన ఈ అమ్మాయి.. 2022లో జాతీయ బ్యాడ్మింటన్ అండర్-15, 16 టోర్నీల్లో టైటిళ్లు సాధించింది. అండర్-19లో రన్నరప్ అయింది. 2023 ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచింది.
2024లో బాన్ అంతర్జాతీయ టోర్నీలో విజేతగా నిలిచిన తన్వి.. 2024 ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్లో చివరిసారిగా భారత మహిళా క్రీడాకారిణి పతకం గెలిచింది సైనా నెహ్వాల్. ఆమె 2008లో పుణెలో జరిగిన ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించింది. సైనా నెహ్వాల్ 2006లో రజత పతకం కూడా గెలుచుకుంది. అపర్ణా పోపట్ 1996లో రజత పతకాన్ని సాధించింది. తన్వీ శర్మ సాధించిన ఈ విజయం 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్‌కు లభించిన పతకం. ఇది దేశానికి గర్వకారణం. . ఒకవైపు చదువుకుంటూనే కెరీర్‌ను కొనసాగిస్తోంది. రోజుకు ఏడు గంటలు ప్రాక్టీస్.. రెండు గంటలు చదువు ఇలా సాగుతోంది ఆమె దినచర్య. సైనా, సింధుల మాదిరే సీనియర్ విభాగంలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com