ASIA CUP: నేపాల్ క్రికెటర్లకు బిగ్ సర్‌ప్రైజ్

ఆసియా కప్‌లో అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న నేపాల్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు సర్‌ప్రైజ్ ఇచ్చారు. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి వారితో కాపేపు ముచ్చటించారు. టీమిండియా క్రికెటర్లు నేపాల్ ఆటగాళ్లకు విలువైన సూచనలను ఇచ్చారు. అనంతరం భారత ఆటగాళ్లతో నేపాల్ క్రికెటర్స్ ఫొటోలు దిగారు. అనంతరం మ్యాచ్‌లో రాణించిన నేపాల్ ఆటగాళ్లను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మెడల్స్‌తో అభినందించారు. నేపాల్ స్కోర్ 200 దాటడంలో కీలకపాత్ర పోషించిన మిడిలార్డర్ బ్యాటర్ సోంపాల్ కామినిని హార్దిక్ పాండ్యా మెడల్‌తో సత్కరించాడు. మెడల్ అతని మెడలో వేసి అభినందించాడు. అలాగే హాఫ్ సెంచరీతో సత్తా చాటిన ఆసిఫ్ షేక్‌ను అభినందించి కోహ్లీ మెడల్ అందించాడు. కొన్ని విలువైన సలహాలు కూడా ఇచ్చాడు. మరో ఆటగాడికి రాహుల్ ద్రావిడ్ మెడల్ బహూకరించాడు.
ఇక ఆసియా కప్‌లో భాగంగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్-4కు దూసుకెళ్లింది. టీమ్‌ఇండియాతో నేపాల్‌కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచే అయినా గట్టి పోటీనిచ్చింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాటర్లు సత్తాచాటారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 230 పరుగులు చేశారు. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 145గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.
2014లో టీ20 హోదాను సంపాదించిన నేపాల్.. కొన్ని నెలలకే అఫ్గానిస్థాన్ మీద సంచలన విజయంతో తన పేరు మార్మోగేలా చేసింది. అప్పటికే అఫ్గాన్ చిన్న జట్లలో పెద్ద టీంగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తోంది. అలాంటి జట్టు మీద టీ20ల్లో గెలవడంతో నేపాల్ వైపు అందరూ చూశారు. ఇక స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెన్యా లాంటి పేరున్న అసోసియేట్ దేశాలపై నేపాల్ కొన్ని అద్భుత విజయాలు సాధించింది. ఒమన్, యూఏఈ, పపువా న్యూ గినియా లాంటి అసోసియేట్ జట్ల మీద నేపాల్‌కు మంచి రికార్డుంది. టీ20ల్లో నిలకడగా రాణిస్తుండటం.. అసోసియేట్ దేశాల టోర్నీల్లోనూ సత్తా చాటుతుండటంతో 2018లో వన్డే హోదా కూడా సంపాదించింది. ప్రపంచ క్రికెట్లో ఘన చరిత్ర ఉన్న, ప్రస్తుత మేటి జట్లలో ఒకటైన టీమ్ ఇండియాతో నేపాల్ తలపడ్డ తొలి మ్యాచ్‌లోనూ నేపాల్ ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com