TEAM INDIA: మరిన్ని షాక్‌లకు సిద్ధం కావాల్సిందేనా.?

భారత్ వన్డే క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించింది. ఈ సారి పెద్ద నిర్ణయం తీసుకుంటూ రోహిత్ శర్మను కెప్టెన్ పదవి నుంచి తప్పించారు. యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ గా నియమించారు. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ జట్టును సిద్ధం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజిత్ అగార్కర్ వెల్లడించారు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా వన్డే, టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 7 నెలల విరామం తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నారు. శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్ గా నియమించారు. గిల్‌కు వన్డే నాయకత్వ బాధ్యతలు అప్పగించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలను బీసీసీఐ వెల్లడించింది.
రోహిత్,విరాట్ భవిష్యత్తుపై అనిశ్చితి?
వన్డే వరల్డ్ కప్ ఆడాలనే ఉద్దేశాన్ని ఇప్పటికే పలుమార్లు విరాట్, రోహిత్ లు వెల్లడించారు. అయితే, ఈ మెగా టోర్నీలో ఇద్దరు స్టార్ల ఆటను చూడటం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే జట్టులో ప్రస్తుతం యంగ్ ప్లేయర్లకు ప్రధాన్యత ఇవ్వడం చూడవచ్చు. అజిత్ అగార్కర్ ప్రకారం.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 ప్రపంచకప్ వరకు ఆడుతారా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరికీ చివరి సిరీస్ కావచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. వారు ఆడినంతకాలం జట్టుకు విలువైన సేవలు అందించినప్పటికీ, కొత్త తరం నాయకత్వాన్ని ఏర్పరచడంలో బీసీసీఐ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
చేదు వార్తలు తథ్యం: గవాస్కర్
రోహిత్ స్థానంలో గిల్‌కు అవకాశం ఇవ్వడం మంచి నిర్ణయమని అభిప్రాయపడిన ఆయన.. ఈ నిర్ణయం రాబోయే కాలంలో కొన్ని చేదు వార్తలకు ఆరంభమన్నాడు. దీంతో ‘త్వరలో రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటాడా?’ అనే చర్చలకు ఊతమిచ్చినట్లు అయింది. ‘‘వన్డే వరల్డ్ కప్ - 2027 కోసం రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడని అనుకోవడం లేదు. ఇంటర్నేషనల్ క్యాలెండర్లో మన జట్టుకు రాబోయే రెండేళ్లలో ఎక్కువ వన్డేలు లేవు. సంవత్సరానికి ఆరేడు మాత్రమే ఆడితే వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ దొరకదు. వరల్డ్ కప్ కోసం ఆ సన్నద్ధత సరిపోదు. అందుకే శుభ్‌మన్ గిల్‌ను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ‘కెప్టెన్సీ’ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.
అదొక్కటే మార్గం: ఇర్ఫాన్ పఠాన్
‘రోహిత్ తన ఫిట్‌నెస్‌పై బాగా పనిచేశాడు. అతడు దానిపైనే దృష్టి పెట్టాడు. రెగ్యులర్ క్రికెట్ ఆడకపోతే కొంత ఆట సమయాన్ని కేటాయించుకని దేశవాళీ క్రికెట్ ఆడాలి. రోహిత్, కోహ్లీ పెద్ద ఆటగాళ్లు. ఎంతో అనుభవం ఉంది. ఏం చేయాలో వారికి తెలుసు. కానీ, సమస్య ఏంటంటే వారిద్దరూ టీ20లు కూడా ఆడటం లేదు. ప్రపంచ కప్‌కు ముందు భారత్ కొన్ని వన్డేలే ఆడనుంది. ఆ మ్యాచ్‌లకు టోర్నీ ఆరంభానికి మధ్య చాలా విరామం ఉంది. వరల్డ్ కప్ కోసం ఫిట్‌గా ఉండటానికి వారు క్రమం తప్పకుండా మ్యాచ్‌లు ఆడటం అవసరం. అప్పుడే 2027 ప్రపంచ కప్ ఆడాలనే రోహిత్, కోహ్లీ కల నెరవేరుతుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com