ముగిసిన టోక్యో ఒలింపిక్స్.. ఏ దేశం ఎన్ని పతకాలు కొట్టిందంటే..?

Tokyo Olympics 2020: విశ్వ సంగ్రామం ముగిసింది. టోక్యో ఒలింపిక్స్ 2020కు తెరపడింది. కరోనా నిబంధనల కారణంగా ముగింపు వేడుకలను అట్టహాసంగా కాకుండా నిరాడంబరంగానే జరగనున్నాయి. జపాన్ జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ ముగింపు వేడుకలు కనువిందు చేయనున్నాయి. బాణసంచా వెలుగులు, జపాన్ పాప్ సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్, పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు. పారిస్‌లో జరగబోయే 2024 ఒలింపిక్స్‌కు సంబంధించి పది నిమిషాల వీడియోను ఫైనల్ డే ప్రదర్శించనున్నారు. చివర్లో ఒలింపిక్స్ టార్చ్‌ను పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులకు అందించడంతో టోక్యో సంగ్రామం ముగుస్తుంది.
విశ్వక్రీడల్లో భారత్ విజయబావుటా ఎగరవేసి ఘనమైన ముగింపును ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు పసిడి, రజతం, కాంస్యం పతకాలను పట్టారు. గతంలో కంటే ఈసారి పతకాల సంఖ్యను భారత్ మెరుపరుచుకుంది. మొత్తం ఏడు పతకాల్ని ఖాతాలో జమ చేసుకుంది భారత్. 125 మందికి పైగా భారత క్రీడాకారులు.. 8 క్రీడాంశాల్లో తలపడ్డారు. భారత్ ఒలింపిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని తెరతీస్తూ నీరజ్ చోప్రా అద్భుతాన్ని సృష్టించాడు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సాధించాడు. వందేళ్ల తర్వాత అథ్లెటిక్స్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశానికి వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పతకం వచ్చింది. మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకం సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లీశ్వరి తర్వాత దేశానికి పతకం అందించిన ఘనత మీరాబాయి చానుదే. ఇక భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ తెలుగుతేజం పీవీ సింధు మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెండో క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది పీవీ సింధు. మహిళా బాక్సర్ లవ్లీనా క్వార్టర్ 69 కేజీల విభాగంలో గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడో భారతీయ బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది.
భారత దేశానికి నాల్గవ పతకం రెజ్లర్ రవి కుమార్ దహియా అందించాడు. రవికుమార్.. 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో రజత పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రెండో భారతీయ రెజ్లర్‌గా రవి కుమార్ దహియా రికార్డ్ సృష్టించాడు. ఇక.. పురుష, మహిళ హాకీ జట్లూ అంచనాలకు మించి రాణించాయి. 41 ఏళ్ల తర్వాత హాకీ క్రీడలో భారత్‌కు పతకం వచ్చింది. భారత పురుషుల హాకీ జట్టు.. జర్మనీని 5-4 తేడాతో ఓడించి కాంస్యం గెలుపొందింది. అలాగే.. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి భారత మహిళల హాకీ జట్టు సెమీస్ దశకు చేరింది. కాంస్య పోరులో ఓడినా.. మన్‌ప్రీత్ సింగ్ టీమ్ ప్లేయర్స్ కనబర్చిన అద్భుత ప్రదర్శనపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువిరిసాయి. అలాగే గోల్ఫ్‌లో అదితి అశోక్ కూడా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. మొదట మెరుగైన ఆటను కనబరిచినా అదితి.. పతకాన్ని ఖాయం చేస్తుందని అందరూ భావించినా.. చివరికి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది.
పసిడి కోసం పరుగులు తీసిన రెజ్లర్ బజరంగ్ పూనియా సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. కాలి నొప్పి ఉన్నా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో పట్టు వదల్లేదు. బజరంగ్ 8-0తో కజకిస్థాన్‌కు చెందిన డి నియాజ్‌బెకోను ఓడించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు రెండో పతకం పట్టాడు బజరంగ్. గత 25 ఏళ్లుగా భారత్.. ఒక్కో ఒలింపిక్ పతకంతోనే సరిపుచ్చుకుంది. 2008లో మూడు పతకాలు సాధించిన భారత్.. 2016లో రెండు మెడల్స్ తీసుకొచ్చింది. తర్వాత 2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలను సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం గత చరిత్రను తిరగరాసింది భారత్. ఈసారి ఏడు పతకాలను సొంతం చేసుకోవడమే కాకుండా పతకాల పట్టికలో 47వ స్థానంలో నిలిచింది భారత్. ఇండియాకు మొత్తంగా ఒక స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్య పతకాలు దక్కాయి.
ఇక.. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతాలే కాదు.. ప్రత్యేకతలు, ఎన్నో సంచలనాలకు నాంది పలికింది. పతకాల సంఖ్య కంటే ఈసారి ఒలింపిక్స్ భారత్‌కు వెరీ వెరీ స్పెషల్‌గా నిలవగా.. చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు తిరుగులేదని మరోసారి చాటాయి. పతకాల పట్టికలో చైనా 38 గోల్డ్ మెడల్స్‌తో టాపర్‌గా నిలిచింది. తరువాత అమెరికా 36 స్వర్ణాలతో సెకండ్ ప్లేస్‌లో ఉండగా.. జపాన్ 27 పసిడి పతకాలతో మూడోస్థానంలో నిలిచింది. ఆర్‌ఓసీ రష్యా, బ్రిటన్ చెరో 20 గోల్డ్ మెడల్స్ సాధించగా.. ఆస్ట్రేలియా 17 బంగారు పతకాలు, జర్మనీ, నెదర్లాండ్స్ చెరో 10 గోల్డ్ మెడల్స్ సాధించాయి.
ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మహిళా వాల్డ్ జిమ్నాస్ట్ ఒక్సానా చుసోవిటినా టోక్యో ఒలింపిక్స్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది ఒలింపిక్స్‌లో పాల్గొని రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు మూడు దేశాల తరపున పాల్గొన్న వాల్డ్ జిమ్నాస్ట్ ఒక్సానాకు.. టోక్యో ఒలింపిక్స్ ఘనమైన వీడ్కోలు పలికింది. అలాగే ఇప్పటికే 10 మెడల్స్‌తో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అత్యధిక పతకాలు సాధించిన మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించిన అమెరికా స్టార్ అలిసన్ ఫెలిక్స్ పదకొండో గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. అమెరికా దిగ్గజం కార్ల్ లూయిస్ పేరిట ఉన్న 10 గోల్డ్ మెడల్స్ రికార్డును ఫెలిక్స్ చెరిపేసి కొత్త చరిత్రను సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com