kiss controversy: ముద్దు తెచ్చిన తంట

kiss controversy: ముద్దు తెచ్చిన తంట
జెన్నిఫర్‌కు లిప్‌ కిస్‌ ఇవ్వడంపై స్పెయిన్‌ సాకర్‌ అధ్యక్షుడి క్షమాపణలు... అయినా చల్లారని ఆగ్రహావేశాలు...

స్పెయిన్ (Spain) సాకర్ జట్టులోని స్టార్‌ ఫుట్‌బాలర్‌ జెన్నిఫర్‌ హెర్మోసో పెదాలపై ముద్దుపెట్టిన వ్యవహారంలో స్పానిష్ సాకర్ సమాఖ్య అధ్యక్షడు లూయిస్ రూబియల్స్‌(President Luis Rubiales )పై ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్(FIFA) క్రమశిక్షణా చర్యలు ఆరంభించింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్(FIFA Women's World Cup)లో 1-0తో ఇంగ్లాండ్ పై స్పెయిన్ నెగ్గగా ఆ జట్టు సంబరాలు చేసుకుంది. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో స్పెయిన్ సాకర్ క్రీడాకారిణి జెన్సీ హెర్మోసో పెదాలపై రుబియల్స్ ముద్దుపెట్టాడు. రుబియల్స్ చేసిన పని తనకు నచ్చలేదని హెర్మోసో పేర్కొంది.


ఈ నేపథ్యంలో మర్యాద పూర్వక ప్రవర్తన , ప్రాథమిక నియమాల ఉల్లంఘన సహా ఫిఫాకు చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తించినట్లు తేలితే రూబియల్స్ పై ఫిఫా వేటు వేయనుంది. క్రీడాకారుల సమగ్రతను గౌరవించడంలో నిబద్ధతతో వ్యవహరిస్తామని ఫిఫా పేర్కొంది. అనుచిత ప్రవర్తనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. స్పానిష్ సాకర్ సమాఖ్య అధ్యక్షుడిగా ఐదేళ్లు పని చేసిన రూబియల్స్ రాజీనామా చేయనున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ఐతే దీనిపై రాయల్‌ స్పానిష్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (RFEF) ఎలాంటి ప్రకటన చేయలేదు.


లిప్‌ కిస్‌ ఘటనపై లూయిస్ రూబియల్స్‌ ఓ మెట్టుకిందికి దిగొచ్చి క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు(Rubiales has apologized) చెప్పాడు. తాను చేసింది తప్పు కావొచ్చని, దానిని అంగీకరించాలని, అమితమైన సంతోష సమయంలో ఎలాంటి దురుద్దేశం లేకుండా జరిగిన చర్య అదని‍ (unwanted kiss‌) రూబియల్స్‌ తెలిపారు. రూబియల్స్‌ క్షమాపణలు చెప్పినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. లూయిస్‌ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ జోక్యం చేసుకున్నారు. లూయిస్‌ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్‌ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఫెడరేషన్‌ అధ్యక్షుడు లూయిస్ రూబియల్స్‌పై చర్యలు తీసుకునేందుకు స్పానిష్‌ హై కౌన్సిల్‌ రంగంలోకి దిగింది. స్పెయిన్‌ ప్రభుత్వం కాని సాకర్‌ కౌన్సిల్‌ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్‌ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారింది.

Tags

Read MoreRead Less
Next Story