ICC RANKINGS: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి తిలక్‌ వర్మ

ICC RANKINGS: ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి తిలక్‌ వర్మ
X
వెస్టిండీస్‌ గడ్డపై అదరగొడుతున్న తిలక్‌వర్మ.... అద్భుత ప్రదర్శనతో ICC ర్యాంకింగ్స్‌లోకి అడుగు...

వెస్టిండీస్‌పై గడ్డపై టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) ICC ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో తిలక్‌వర్మ మంచి ప్రదర్శన చేశాడు. తొలి 3 టీ20ల్లో వరుసగా 39, 51, 49 పరుగులతో రాణించిన తిలక్ వర్మ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ ప్రదర్శనలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించి 46వ స్థానంలో నిలిచాడు. చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్ (Kuldeep Yadav) టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 36 స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం అతడు 51వ స్థానంలో ఉన్నాడు.


వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మనవాళ్లు సత్తా చాటారు. ఇషాన్‌ కిషన్‌, శుభ్‌మన్ గిల్ వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంకులు దక్కించుకున్నారు. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) 743 రేటింగ్ పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో 3 హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) 9 స్థానాలు ఎగబాకి 36వ స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో బాబర్ అజామ్ (886) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్‌ డసెన్ (777) రెండో స్థానంలో ఉన్నాడు. పాక్‌ ఆటగాళ్లు ఫకార్‌ జమాన్‌ (755), ఇమామ్‌ ఉల్ హక్ (745) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 9వ స్థానంలో, రోహిత్ శర్మ 11వ స్థానంలో ఉన్నారు.


ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య బ్యాటర్ల విభాగంలో 10 స్థానాలు మెరుగై 71వ స్థానంలో నిలవగా ఆల్‌రౌండర్ల కేటగిరీలో 11వ స్థానంలో ఉన్నాడు. విండీస్‌పై వన్డే సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్‌ మూడు స్థానాలు మెరుగై 30వ స్ధానానికి చేరుకున్నాడు.

ఇంత త్వరగా భారత్‌ తరఫున అరంగేట్రం చేస్తానని ఊహించలేదని యువ బ్యాటర్‌ తిలక్‌వర్మ ఇటీవలే తన ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌ గెలవడమే తన లక్ష్యమని తెలిపాడు. దేశం తరఫున ఆడాలన్నది ప్రతి ఒక్కరి కల అని. తన కెరీర్‌లో ఇంత త్వరగా భారత్‌కు ఆడతానని అనుకోలేదని తెలిపాడు. భారత్‌కు ప్రపంచకప్‌ అందించాలన్నదే చిన్నప్పటినుంచి తన లక్ష్యమని ప్రకటించాడు. ప్రపంచకప్‌ గెలుపు క్షణం కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నానని తిలక్‌ వివరించాడు.

Tags

Next Story