IPL: ఐపీఎల్‌ విజేత కోల్‌కత్తా

IPL: ఐపీఎల్‌ విజేత కోల్‌కత్తా
X
హైదరాబాద్‌పై ఘన విజయం.... మూడోసారి కప్పు కైవసం చేసుకున్న కేకేఆర్‌

ఐపీఎల్‌17వ సీజన్‌ విజేతగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన కోల్‌కతా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది.టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కూప్పకూలింది. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన హైదరాబాద్‌ బ్యాటర్లు తుదిపోరులో పూర్తిగా తేలిపోయారు. కోల్‌కతా బౌలర్ల ధాటికి ఏకంగా ఏడుగురు హైదరాబాద్‌ బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యారు. కమిన్స్‌ 24, మార్‌క్రమ్‌ 20, క్లాసన్‌ 16, నితీశ్‌ రెడ్డి 13 పరుగులు మాత్రం రెండెంకల స్కోరు సాధించారు. రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్‌, హర్షిత్‌ రాణా చెరో 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి, నరైన్‌, వైభవ్‌ అరోరా తలో వికెట్‌ తీశారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా కేవలం 10.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించి ట్రోఫిని ముద్దాడింది. వెంకటేశ్‌ అయ్యర్‌ 52 పరుగులతో మెరిశాడు. రెహ్మనుల్లా గుర్బాజ్‌ 39 రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో కమిన్స్‌, షాబాజ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.


మూడోసారి

ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో కోల్‌కతా కప్పును ముద్దాడింది. విజేతగా నిలిచిన కోల్‌కతాకు రూ.20 కోట్ల లభించగా, రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌కు రూ. 12.5 కోట్లు దక్కాయి. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఈ ఇయర్‌ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సీజన్‌ అవార్డు గెలుచుకున్నాడు. అటు బ్యాట్‌తో బంతితో మెరిసిన సునీల్‌ నరైన్‌ను మోస్ట్‌ వాల్యూబుల్‌ ప్లేయర్‌ అవార్డు వరించింది. ఈ అవార్డు నరైన్‌ గెలుచుకోవడం ఇది మూడోసారి.. దీంతో మూడుసార్లు ఈ అవార్డు గెలుచుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సాధించాడు. 2012,2018లలో నరైన్‌ ఈ అవార్డును గెలుచుకున్నాడు.

హైదరాబాద్ పతనం సాగిందిలా..

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌కు అది ఎంత చెత్త నిర్ణయమో తెలుసుకొనేలోపే కీలక వికెట్లను కోల్పోయింది. తెలుసుకొని ఆడుదాం అని నిర్ణయించుకొనేలోపే మిడిలార్డర్ పోయింది. మొత్తానికి గట్టిగా ప్లాన్ చేసుకోనే లోపే వికెట్లన్నీ పెవిలియన్ చేరాయి .. ఇంతకంటే హైదరాబాద్‌ బ్యాటర్ల ఆటగురించి చెప్పుకోవడానికి ఏం మిగలలేదు. గత మ్యాచ్ లలో అదరగొట్టిన ఒక్క బ్యాటర్ కూడా ఈసారి బౌలర్లను బెదరగొట్టడం కాదు కనీసం ఎదురకోలేకపోయారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ , రాహుల్ త్రిపాఠి సింగిల్ డిజిట్ స్కోరు చేయగా మార్‌క్రమ్, నితీశ్‌ రెడ్డి, క్లాసెన్ పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ టాప్ స్కోర్ పాట్ కమిన్స్‌ చేసిన 24 పరుగులు మాత్రమే. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రీ రస్సెల్ మూడు వికెట్లు తియ్యగా , మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణాలు చెరో రెండు, వైభవ్ అరోరా, నరైన్, వరుణ్‌ చక్రవర్తి తలో వికెట్ తీశారు.

Tags

Next Story