ind Vs Aus : తొలి భారత్‌-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌

ind Vs Aus : తొలి భారత్‌-ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్‌
వైజాగ్‌ వేదికగా ఇరు జట్ల అమీతుమీ...

భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్ల మధ్య తొలి ట్వంటీ-20 సమరానికి విశాఖలోని V.C.A-V.D.C.A స్టేడియం సిద్ధమైంది. మ్యాచ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

ప్రపంచకప్‌ సమరం ముగిసిన వెంటనే భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య జరిగే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి ట్వంటీ-20 మ్యాచ్‌ నిర్వహణకు విశాఖ ముస్తాబైంది. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్టు 90 శాతం విజయాలను నమోదు చేసింది. ఇప్పటికే విశాఖకు చేరుకున్న భారత, ఆస్ర్టేలియా జట్ల ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తూ మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నారు. రాత్రి 7 నుంచి 11 గంటల వరకు జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌కు సాయంత్రం 5 గంటల నుంచి ప్రేక్షకులను అనుమతించనున్నారు. స్టేడియం సామర్థ్యం.. సుమారు 28 వేల మంది కాగా... 30కి పైగా గేట్ల ద్వారా ప్రేక్షకులను లోపలికి అనుమతించే అవకాశం ఉంది. మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు జరగకుండా స్టేడియం చుట్టూ బారికేడ్లతో పాటు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసు సిబ్బందితో మూడంచెల భద్రతతో పాటు స్టేడియం లోపల, వెలుపలా, చుట్టూ ఉన్న బహుళ అంతస్థులపైన, రూఫ్ టాప్‌లపై నిఘా పెట్టి పర్యవేక్షించనున్నారు. జన సామర్థ్యం అధికంగా ఉండే చోట్లా ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా బందోబస్తు చేశారు.


గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నకిలీ టిక్కెట్లు కొనుగోలు చేసి అభిమానులు మోసపోవద్దని నిర్వహణ కమిటీ సభ్యులు చెబుతున్నారు. బయటి నుంచి తీసుకువచ్చే తినుబండరాలు, వాటర్‌ బాటిల్స్‌ను స్టేడియంలోనికి అనుమతించబోమన్నారు. ▪️స్టేడియం మొత్తం CC కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని... ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినా, పరిధి వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మ్యాచ్‌ నిర్వహణ సందర్భంగా వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించినట్లు పోలీస్‌ అధికారులు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story