ఒలింపిక్స్ పురుషుల హాకీ సెమీస్‌లో భారత జట్టు ఓటమి

Tokyo Olympics: ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఫైనల్స్‌కు చేరడంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవన్నీ తల్లకిందులయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన సెమీస్ మ్యాచ్‌లో బెల్జియం భారత్‌పై 5-2 తేడాతో విజయం సాధించింది. ఆఖరి క్వార్టర్‌లో పెనాల్టీ కార్నర్ల రూపంలో భారీమూల్యం చెల్లించుకుని భారత్ జట్టు మ్యాచ్ చేజార్చుకుంది. ఐతే.. మ్యాచ్‌లో అనుక్షణం ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఎటాకింగ్ చేయడం, దూకుడుగా ఆడడంలో హాకీ టీమ్ పూర్తిస్థాయిలోనే ప్రతిభ చూపించినా.. ఆఖరి రౌండ్‌లో చేసిన ఒకట్రెండు పొరపాట్లు మొత్తం మ్యాచ్‌ను బెల్జియంవైపు మలుపుతిప్పేశాయి. హ్యాట్రిక్ గోల్స్‌తో అలెగ్జాండర్ హెండ్రిక్స్ చెలరేగిపోయాడు. ఈ కారణంగా మన గోల్డ్ మెడల్ ఆశలు గల్లంతైనా.. ఇంకా కాంస్య పతకం కోసం పోరాటం మిగిలే ఉంది.
ఇక ఇవాళ్టి సెమీస్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆట మొదలైన తొలి క్వార్టర్‌లో మన జట్టు చాలా దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే తొలిగోల్‌తో బెల్జియం ఆధిక్యం ప్రదర్శించినా.. కాసేపటికే వరుసగా రెండు గోల్స్‌తో టీమిండియా పైచేయి సాధించింది. 8వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌సింగ్, 11వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ అద్భుతమైన ఆటతో గోల్స్ సాధించారు. తొలి క్వార్టర్ ముగిసేసరికి 2-1తో భారత్ టీమ్ ఆధిక్యంలో ఉంది.
సెకండ్ క్వార్టర్‌లో 16వ నిమిషంలో బెల్జియం ప్లేయర్ హండ్రిక్స్ మరో గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. ఇక అక్కడి నుంచి ఉత్కంఠ మరింత పెరిగిపోయింది. టీమిండియా ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై వరుస హిట్‌లతో విరుచుకు పడుతూనే.. తమ గోల్‌పోస్ట్ వద్ద డిఫెన్స్ గేమ్‌ను అద్భుతంగా మేనేజ్ చేశారు. 29వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించినా మన్‌దీప్ దాన్ని గోల్‌గా మలచలేకపోయాడు. అంతకుముందు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకున్న బెల్జియం గోల్ కొట్టడంతో స్కోర్ 2-2 అయ్యింది. హాఫ్ టైమ్ ముగిసేసరికి ఇరు జట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగానే మారింది.
ఇక మూడో క్వార్టర్‌లో ఎటాకింగ్‌ను మరింత పెంచిన భారతజట్టు దూకుడుగా ఆడినా, బెల్జియం కూడా అదే తరహా ఆటతీరు ప్రదర్శించింది. 45 నిమిషాల ఆట ముగిసినా స్కోర్లు చెరిసమంగానే ఉండడంతేో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక అక్కడి నుంచి ఫోర్త్ క్వార్టర్‌లో మ్యాచ్ క్రమంగా బెల్జియం చేతుల్లోకి వెళ్లిపోయింది. పెనాల్టీ కార్నర్ల రూపంలో ప్రత్యర్థి జట్టు భారత్‌పై వరుసగా గోల్స్ చేసింది. భారత జట్టు ఫార్వార్డ్ ప్లేయర్లు కూడా ఆఖరు 15 నిమిషాల్లో వాళ్లను నిలువరించలేకపోయారు.
అటు, మ్యాచ్ సగం సమయం ముగిసిన దశలో భారతజట్టు ఆటతీరును మోదీ ప్రశంసించారు. తాను మ్యాచ్ చూస్తున్నానని ట్వీట్ చేశారు. టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ.. సెకండ్ హాఫ్‌లో చేసిన చిన్న చిన్న పొరపాట్లతో భారత జట్టు ఫైనల్‌కి చేరలేకపోయింది. ఈ విషయంలో నిరాస ఉన్నా.. ప్లేయర్ల స్ఫూర్తివంతమైన ఆటతీరును అభినందిస్తున్నారు. కాంస్య పతకమైనా కచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com