టోక్యో ఒలింపిక్స్.. వినూత్న రీతిలో మెడల్స్ తయారీ
Medals made from old phones
Tokyo Olympics 2021: జపాన్ రాజధాని టోక్యోలో విశ్వ క్రీడా సంరంభం ప్రారంభం కాబోతోంది. కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు జరుగుతున్నాయి. ఎట్టకేలకు ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. జపనీయులకు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రీడలు చూసే అవకాశం కల్పించారు. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు క్రీడాకారులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సృజనాత్మకత, నవ్యతకు జపాన్ పెట్టింది పేరు. ప్రపంచమంతా ఒకదారిలో ఉంటే.. జపాన్ దానికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని... విజయం సాధించి చూపుతుంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ నిర్వహణలోనూ జపాన్ అదే మార్గంలో పయనిస్తోంది. క్రీడా గ్రామాన్ని రూపొందించడం దగ్గరి నుంచి... పతకాల తయారీ వరకు... వినూత్న మార్గాలను ఎంచుకుంది. ఆధునికతను, సంప్రదాయాన్ని జోడించి పతకాలను తయారు చేసింది. పర్యావరణ హితానికి కూడా ఇందులో పెద్దపీట వేసింది.
ఒలింపిక్స్ మెడల్స్‌ను వినూత్న రీతిలో తయారు చేయాలని ముందే నిర్ణయించుకున్న జపాన్.. అందుకోసం మూడేళ్ల నుంచే.. దేశ వాసుల నుంచి పాత మొబైల్ ఫోన్లను సేకరించింది. అందులో నుంచి లోహ విడిభాగాలను వేరు చేసి వాటిని కరిగించి మెడల్స్‌ను తయారు చేశారు. ఆధునాతన కంప్యూటర్ డిజైన్లతో... అత్యంత అద్భుతంగా పతకాలను రూపొందించారు. దీని ద్వారా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ చెత్త... మహత్తరమైన కార్యక్రమానికి పనికొచ్చినట్లైంది.
మరోవైపు ఒలింపిక్స్ మెడల్ ట్యాగ్‌లను కూడా జపాన్ సంప్రదాయపద్దతిలోనే తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన దారాలతో ఈ ట్యాగ్‌లను నేయించింది. దీంతో పాటు... పతకాలను ఉంచేందుకు... కలపతో ప్రత్యేక డబ్బాలను కూడా రూపొందించింది. జపాన్ సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ఉన్న ఈ మెడల్స్... అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
టోక్యో ఒలింపిక్స్ పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి. కొత్తగా ఐదు విభాగాలను ఈసారి ప్రవేశపెట్టారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, జూడో మిక్స్‌డ్ టీమ్‌ను పునరుద్దరించారు. స్విమ్మింగ్ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇంకా పలు క్రీడల్లో కూడా మార్పులు చేశారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో 205 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ జపాన్ ప్రభుత్వం టోక్యోలో అన్ని వసతులతో క్రీడా గ్రామాన్ని నిర్మించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com