అట్టహాసంగా ఆరంభమైన టోక్యో ఒలింపిక్స్..!

గత ఏడాది జరగాల్సిన ఈ ఒలింపిక్స్ క్రీడలు.. కరోనా మహమ్మారి కారణంగా ఈఏడాదికి వాయిదా పడింది. ప్రేక్షకులు లేకుండానే తొలిసారి ఒలింపిక్స్ క్రీడలు జరగబోతున్నాయి. జపనీయులకు మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రీడలు చూసే అవకాశం కల్పించారు. ఇవాళ్టి తొలిరోజు క్రీడల్లో కొన్ని జట్లు.. పలు విభాగాల్లో పోటీ పడుతుండగా.. తమ దేశాల క్రీడాకారుల ప్రతిభా పాటవాలను చూసేందుకు ప్రేక్షకులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
టోక్యో ఒలింపిక్స్ పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. 33 విభాగాల్లో 339 ఈవెంట్లు జరగబోతున్నాయి. కొత్తగా ఐదు విభాగాలను ఈసారి ప్రవేశపెట్టారు. సర్ఫింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్, కరాటే, బేస్‌బాల్ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగంగా మార్చారు. ఇటీవలి కాలంలో రద్దయిన టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్, జూడో మిక్స్‌డ్ టీమ్‌ను పునరుద్దరించారు. స్విమ్మింగ్ పోటీల్లో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇంకా పలు క్రీడల్లో కూడా మార్పులు చేశారు. ఈ నెల 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సహా 205 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరందరికీ జపాన్ ప్రభుత్వం టోక్యోలో అన్ని వసతులతో క్రీడా గ్రామాన్ని నిర్మించింది.
ఇదిలా ఉంటే.. టోక్యో ఒలింపిక్స్‌కు కరోనా మహమ్మారి భయం వెంటాడుతోంది. శుక్రవారం పాజిటీవ్ కేసులు వంద దాటడంతో క్రీడాకారులందరికీ కలవరపెడుతోంది. దీనికి తోడు తాజాగా మరో 19 మంది అథ్లెట్స్‌కు వైరస్ సోకినట్లు తెలిసింది. చెక్ రిపబ్లిక్ బృందంలోనే అత్యధిక మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు అథ్లెట్స్, పది మంది క్రీడా సిబ్బంది, ముగ్గురు జర్నలిస్టులతో పాటు మరో కాంట్రాక్టర్లకు కొవిడ్ వైరస్ సోకిందని నిర్వాహకులు తెలిపారు. ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతుండటంతో ఈ ఒలింపిక్స్ గ్రామంలో ఇంకా ఎంతమందికి వైరస్ సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com