చెదిరిన కాంస్యం కల..పోరాడి ఓడిన భారత అమ్మాయిలు

చెదిరిన కాంస్యం కల..పోరాడి ఓడిన భారత అమ్మాయిలు
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా హాకీ జట్టుకు నిరాశ ఎదురైంది. కాంస్య పతాకం కోసం జరిగిన పోరులో టీమిండియా మహిళా జట్టు బ్రిటన్‌ చేతిలో 4-3 తేడాతో ఓటమి పాలైంది. హోరాహోరీగా సాగిన ప్లేఆఫ్‌ పోరులో మహిళా హాకీ జట్టు పోరాట పటిమ ప్రదర్శించింది. మ్యాచ్‌ ఆరంభమైన తొలి 10 నిమిషాల్లోనే బ్రిటన్ జట్టుకు గోల్ సాధించి ఉత్సాహంతో ముందుకు సాగింది. అయితే రాణి సేన రెండో క్వార్టర్‌లో కేవలం 5 నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్‌ చేసి సత్తా చాటింది. గుర్జీత్‌ కౌర్‌ 2, వందనా కటారియా 1గోల్ వేసి.. ముందంజలో నడిపించారు.

అయితే వెంటనే తేరుకున్న బ్రిటన్ మూడో క్వార్టర్‌ ముగిసే సరికి ఇరు జట్లు 3-3తో సమానం చేసింది. ఇక చివరి క్వార్టర్‌లో ఫలితం తారుమారుకావడంతో పతకం గెలవలేకపోయింది. నాలుగో క్వార్టర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. చివరి 15 నిమిషాల ఆటలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. గెలుపు కోసం రాణి రాంపాల్‌ సేన ఆఖరి వరకు పోరాడింది. దీంతో మహిళల హాకీ చరిత్రలో తొలి ఒలింపిక్‌ పతకం చేరాలని ఆశించిన భారత్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే భారత హాకీలో అమ్మాయిల పోరాటపటిమ చూసి యావత్ భారతదేశం కొనియాడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story