FootBall: భారత మహిళా ఫుట్‌బాల్ దార్శనికులు

భారతదేశంలో క్రీడలు అంటే కేవలం క్రికెట్, హాకీ, చెస్ వంటి కొన్ని ఆటల పేర్లే గుర్తుతెచ్చుకుంటారు. ఈ మధ్యే ఎంతో కొంత ఫుట్‌బాల్ వైపు కూడా యువత ఆసక్తి చూపుతున్నారు. ఇండియన్ ఫుట్‌టాల్ అంటే గుర్తుకువచ్చే పేరు సునీల్ ఛెత్రి లాంటి వేళ్లపై లెక్కించగలిగే పేర్లే కనబడతాయి. కానీ భారత మహిళల ఫుట్‌బాల్ గురించి ఎంతమందికి అవగాహన ఉందో చెప్పడం కష్టమే. కానీ భారత మహిళా ఫుట్‌బాల్ గత చరిత్ర ఘనంగానే ఉందన్న సంగతి చాలా మందికి తెలియని విషయం.
భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్‌లో 4 దశాబ్దాల గందరగోళ పరిస్థితుల అనంతరం, మారుతున్న కాలానుగుణంగా గత దశాబ్ధ కాలంగానే ఎంతో కొంత ఎదుగుతూ వస్తూ మార్పు కనబడుతోంది.
1975 నుండి 1991 వరకు, భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్‌ను, ఆసియా మహిళల ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ALFC) ఆధ్వర్యంలో, ఉమెన్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFFI) నిర్వహించింది. ఫుట్‌బాల్‌ను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ సమాఖ్య (FIFA), ALFC, ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (AFC)లకు అధికారిక గుర్తింపు ఇవ్వని కారణంగా మన జాతీయ జట్టు ఆడే అనేక మ్యాచ్‌లు, పోటీలను 'అనధికారికం'గా ప్రకటించింది.
అయినప్పటికీ, వారు ఆసియాలో ప్రబలమైన టీంగా ఉంటూ 1979, 1983 AFC ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లలో (మహిళల ఆసియా కప్) రన్నరప్‌గా నిలిచారు. హాంకాంగ్‌లో జరిగిన 1981 ఎడిషన్‌లో 3వ స్థానంలో నిలిచారు.
2018 సంవత్సరంలో, భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు చరిత్రలో తొలిసారిగా ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ (టోక్యో-2020) రెండో రౌండ్‌కు చేరుకుంది. 2024 లో పారిస్ ఒలంపిక్స్ కోసం మహిళల AFC ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో భారత్ ఇప్పటికే రెండవ రౌండ్‌లోకి ప్రవేశించింది.
2022లో ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించడంతో భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్ క్రీడలో కీలకమైన మైలురాయిగా గుర్తుండిపోయింది.
మహిళలుగా ఆనాటి నుంచి ఎన్నో అసమానతల్ని, అవమానాల్ని ఎదుర్కొంటూ, ఎందరికో ప్రేరణనిస్తూ భారత మహిళా ఫుట్‌బాల్ ఈ స్థాయికి ఉండడానికి దోహదం చేసిన వారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరిపై స్పెషల్ కథనం..
శాంతి మల్లిక్ - మొదటి హ్యాట్రిక్ తనదే..
ఆ కాలంలో భారత మహిళల జట్టులో అతిపెద్ద స్టార్ కెప్టెన్ శాంతి మల్లిక్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తన కెరీర్ మొత్తంలో ఒక్కసారి కూడా రిఫరీల నుంచి రెడ్ కార్డులు తీసుకోని క్రీడాకారిణి ఈమె. 1983లో ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణి.
బెంగాల్‌కు చెందిన ఈమె ఫుట్‌బాల్ క్రీడలో మాత్రమే కాకుండా క్రికెట్, హాకీలో కూడా ప్రావీణ్యం ఉంది. అలాగే 1978లో జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ ఛాంపియన్ కూడా.
ఓయినమ్ బెంబెమ్ దేవి - భారతీయ ఫుట్‌బాల్ దుర్గ
మణిపూర్‌కు చెందిన ఓయినమ్ బెంబెమ్ దేవి భారతీయ మహిళల ఫుట్‌బాల్‌లో లివింగ్ లెజెండ్. భారతదేశంలో మహిళల ఫుట్‌బాల్‌కు దుర్గ అని పేరు. 15 సంవత్సరాల వయస్సులోనే సీనియర్ భారత మహిళల జాతీయ జట్టులోకి అడుగుపెట్టింది ఈ మిడ్‌ఫీల్డర్.
జాతీయ జట్టు తరపున 85 మ్యాచ్‌లు ఆడి 32 గోల్స్ చేసింది. బెంబెమ్ నాయకత్వంలో భారత్ వరుసగా 2010 బంగ్లాదేశ్‌లో, 2012 శ్రీలంక, 2014 పాకిస్తాన్‌లో శాఫ్ టైటిళ్లను సాధించింది. 2010, 2016 సంవత్సరాల్లో దక్షిణాసియా క్రీడల్లో భారత్‌కు బంగారు పతకాల్ని సాధించి పెట్టింది.
ఆమె 2001లో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) మొట్టమొదటి మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. 2013లో మళ్లీ అవార్డును గెలుచుకుంది.
2017లో, మల్లిక్ తర్వాత అర్జున అవార్డును గెలుచుకున్న రెండవ భారత మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా పేరుగాంచింది. 3 సంవత్సరాల తర్వాత, భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని గెలుచుకున్న మొదటి మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా చరిత్రలో నిలిచిపోయింది.
2016లో రిటైర్మెంట్‌కి ముందు వరకు 21 సంవత్సరాల పాటు జట్టుకు తన అసమాన సేవలందించింది.
బాలా దేవి - రేంజర్స్ నం. 10
బెంబెమ్ నుండి ప్రేరణ పొందిన బాలా దేవి ఇప్పటికే భారతీయ మహిళల ఫుట్‌బాల్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
బెంబెమ్ లాగా, బాలా 15 సంవత్సరాల వయస్సులో సీనియర్ జట్టులోకి ప్రవేశించి తన ఆటతో 2005 నుండి జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంది. కేవలం 58 అంతర్జాతీయ మ్యాచుల్లో 52 గోల్స్ చేసి అందరినీ అబ్బురపరిచంది. ఈ గణాంకాలకు ఆశ్చర్యపోయే జనవరి 2020లో స్కాటిష్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జట్టుతో ఆమెతో 18 నెలల ఒప్పందంపై సంతకం చేసింది.
డిసెంబర్ 6, 2020న, బాలా దేవి 9-0తో మదర్‌వెల్‌పై రేంజర్స్ తరపున నెగ్గిన తర్వాత యూరప్‌లోని ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో స్కోర్ చేసిన మొదటి భారతీయ ఖ్యాతిగాంచింది.
2014, 2015లో రెండుసార్లు AIFF మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ విజేతగా నిలిచింది.
అదితి చౌహాన్ - ది వాల్
భారతదేశంలోని అత్యుత్తమ మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారిణులలో అదితి కూడా ఒకరు.
అదితి చౌహాన్ చాలా సంవత్సరాలుగా భారత మహిళల జాతీయ ఫుట్‌బాల్ జట్టకు ప్రధాన గోల్ కీపర్‌గా ఉంది. 2018లో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ రెండవ రౌండ్‌కు భారత్ వెళ్లడంలో కీలకపాత్ర పోషించింది.
ఇంగ్లాండ్‌లోని మూడవ డివిజన్ సెమీ-ప్రొఫెషనల్ లీగ్ టీం వెస్ట్ హామ్ మహిళల జట్టు తరపున 2018 వరకు ప్రాతినిధ్యం వహించింది. లండన్‌లో జరిగిన మూడవ ఆసియా ఫుట్‌బాల్ అవార్డులలో 2015 ఉమెన్ ఇన్ ఫుట్‌బాల్ అవార్డును కూడా గెలుచుకుంది.
ఆశాలతా దేవి- ఆసియా అత్యుత్తమ డిఫెండర్
భారత మహిళల జాతీయ జట్టు కెప్టెన్‌గా బెంబెమ్‌కు సమర్థవంతురాలైన వారసురాలిగా ఆశాలతా దేవి నిలిచింది. ఆసియాలోని అత్యుత్తమ డిఫెండర్‌లలో ఆశాలత ఒకరు.
టోక్యో-2020 కోసం ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ప్రచార కార్యక్రమానికి భారత్‌కు ఆశాలత నాయకత్వం వహించింది. 2019 దక్షిణాసియా క్రీడలలో జట్టుకు టైటిల్ సాధించిపెట్టడమే కాకుండా AIFF మహిళా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.
AFC ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2019 అవార్డు కోసం ఎంపికైన చివరి ముగ్గురు ఆటగాళ్ల షార్ట్‌లిస్ట్‌లో ఆశాలత కూడా ఉంది. మాల్దీవియన్ ఫుట్‌బాల్ క్లబ్ న్యూ రేడియంట్ తరపున ధివేహి ప్రీమియర్ లీగ్‌లో విదేశాలలో కూడా ప్రాతినిధ్యం వహించింది.
పాశ్చాత్య దేశాల్లో ఫుట్‌బాల్ క్రీడలో మహిళలకు పురుషులతో దాదాపు సమానంగానే అవకాశాలున్నాయని చెప్పాలి. ముఖ్యంగా యూరప్ ఖండంలో ఫుట్‌బాల్ ఒక మతంలా వారి జీవితాల్లో భాగమైంది. పురుషులకు ఉన్నట్లుగానే, మహిళలకు కూడా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్, లీగ్ ఎఫ్, బుందేస్‌లిగా, సూపర్ లీగ్ వంటి ప్రత్యేక లీగ్‌లు ఉంటూ వారిని క్రీడల్లో భాగస్వాముల్ని చేస్తూ అవకాశాలు కల్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com