TPL: వచ్చేస్తోంది.. తెలంగాణ ప్రీమియర్ లీగ్

క్రికెట్ ప్రియులకు మరో శుభవార్త అందింది. తెలంగాణ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంయుక్త కార్యదర్శి ఎన్నికలో గోవా క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన రోహన్ దేశాయ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో హెచ్‌సీఏ ప్రతినిధిగా జగన్ మోహన్ రావు... బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవాజిత్ సైకియా సహా బీసీసీఐ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రీమియర్ లీగ్ తో పాటు తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన మొయినుద్దౌలా గోల్డ్ కప్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సహకరించాలని జగన్ మోహన్ రావు కోరగా, బీసీసీఐ అంగీకరించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో టీపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి ఇచ్చిందని జగన్ తెలిపారు.
మౌలిక సదుపాయల కల్పనకు...
తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బీసీసీఐ సహకరించాలని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ కోరారు. ఇందుకు కూడా బీసీసీఐ పెద్దలు సానుకూలంగా స్పందించారని జగన్మోహన్ రావు వెల్లడించారు. టీపీఎల్ మరో రెండు నెలల్లో ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు రూ. కోటీ
ఐపీఎల్ ముగిసిన అనంతరం యంగ్ క్రికెటర్ల కోసం టీపీఎల్ నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రతి ఉమ్మడి జిల్లాకు రూ.కోటి కేటాయిస్తున్నట్టు వివరించారు. ఉమ్మడి జిల్లాలో 10 ఎకరాల చొప్పున కొనుగోలు చేసి కొత్త స్టేడియాలు నిర్మిస్తామని అన్నారు. ఆ పనులు పూర్తయ్యేవరకు మైదానాలను లీజుకు తీసుకుంటామని తెలిపారు. బాగా రాణిస్తున్న తెలంగాణ క్రికెటర్లను సత్కరించేందుకు వచ్చేనెల హెచ్‌సీఏ అవార్డుల వేడుకను నిర్వహించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియాన్ని ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. 2018లో హెచ్‌సీఏ ప్రెసిండెంట్‌గా వివేక్ వెంకటస్వామి ఉన్న సమయంలో జి.వెంకటస్వామి మెమోరియల్ టీటీఎల్ నిర్వహించారు. అప్పట్లో అది బాగా ప్రజాదరణ పొందింది. తిలక్ వర్మ ఆ లీగ్‌తోనే వెలుగులోకి వచ్చాడు. అనంతరం వచ్చిన హెచ్‌సీఏ పాలక వర్గం టీపీఎల్‌ను కొనసాగించలేదు. మళ్లీ ఇప్పుడు ఇది ప్రారంభం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com