BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో ముదురుతున్న సంక్షోభం

బంగ్లాదేశ్ క్రికెట్ సంక్షోభం వైపు పయనిస్తోంది. ఒకప్పుడు ఆసియా క్రికెట్‌లో పోటీ తత్వాన్ని చూపించిన బంగ్లా జట్టు, ఇప్పుడు మైదానంలో కంటే పరిపాలనా గదుల్లోనే ఎక్కువగా పోరాటం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయాలు, బోర్డు అధికారుల వ్యాఖ్యలు, ఆటగాళ్ల ఆగ్రహం అన్నీ కలసి దేశ క్రికెట్‌ను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా బోర్డు డైరెక్టర్, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఈ సంక్షోభం తారస్థాయికి చేరింది.ఫలితంగా ఆటగాళ్లు బహిరంగంగా తిరుగుబాటు స్వరం వినిపించడం.. మ్యాచ్‌ల బహిష్కరణ వరకు వెళ్లడం బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో అరుదైన పరిణామంగా మారింది.
సంక్షోభం వైపు పయనం...
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)- ఆటగాళ్ల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచకప్ వేదికల అంశంపై ఇప్పటికే ఐసీసీ, బీసీబీలతో అభిప్రాయ భేదాలు ఎదుర్కొంటున్న బీసీబీకి, ఇప్పుడు స్వదేశీ ఆటగాళ్ల నుంచే తీవ్ర సవాలు ఎదురవుతోంది. పరిపాలనా వైఫల్యాలు, స్పష్టతలేని నిర్ణయాలు, ఆటగాళ్ల పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత విషమంగా మార్చాయి.బీసీబీ డైరెక్టర్‌గా, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న నజ్ముల్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కేంద్రబిందువయ్యాయి. ఆటగాళ్ల ప్రదర్శనను ఉద్దేశించి “కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా అంతర్జాతీయ టోర్నీల్లో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. వారు విఫలమైతే ఖర్చు చేసిన డబ్బులు తిరిగి అడగాలి” అన్న వ్యాఖ్యలు ఆటగాళ్ల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ మాటలు కేవలం విమర్శగానే కాకుండా అవమానంగా మారాయని ఆటగాళ్లు భావించారు.
నజ్ముల్ తొలగింపు
పరిస్థితి చేయి దాటుతుండటంతో బీసీబీ నజ్ముల్ ఇస్లాంపై షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ ఆటగాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో, చివరకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నజ్ముల్ ఇస్లాంను బీసీబీ ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వివాదాన్ని కొంతమేర సద్దుమణిగించిందని భావించినా, ఆటగాళ్లలోని అసంతృప్తి పూర్తిగా తొలగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ అంతర్గత సంక్షోభం అంతర్జాతీయ క్రికెట్‌పై కూడా ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. 2026 టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, భారత్–బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ ఐసీసీని కోరినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది బంగ్లాదేశ్ క్రికెట్‌లోని అస్థిరతను ప్రపంచానికి చాటిచెప్పే పరిణామంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఇది కేవలం ఒక అధికారి వ్యాఖ్యల వల్ల చెలరేగిన వివాదం కాదు; వ్యవస్థలోని లోతైన లోపాల ప్రతిబింబం. నజ్ముల్ ఇస్లాం తొలగింపుతో తాత్కాలికంగా పరిస్థితి చల్లబడినట్లే కనిపించినా, ఆటగాళ్ల విశ్వాసాన్ని తిరిగి పొందడం బీసీబీకి పెద్ద సవాలుగానే మిగిలింది. ఈ సంక్షోభం నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ బయటపడాలంటే, పరిపాలనలో పారదర్శకత, ఆటగాళ్ల గౌరవం, దీర్ఘకాలిక వ్యూహాలు తప్పనిసరిగా అవసరమన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

