US OPEN: అల్కరాజ్, కరోలినా ముచోవా ముందంజ

ప్రపంచ నెంబర్ వన్ కార్లోస్ అల్కరాస్ యుఎస్ ఓపెన్ ప్రీక్వార్టర్‌లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ అల్కరాజ్ 6-2, 6-3, 4-6, 6-3తో డాన్ ఇనాన్స్‌పై నెగ్గాడు. ఈ మ్యాచ్‌లో అల్కరాస్ ఆరు ఏస్‌లు, 61 విన్నర్లు కొట్టాడు. మరో మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6-2, 6-2, 7-6(6)తో సెబాస్టియన్ బేజ్‌పై విజయం సాధించాడు. పదునైన సర్వీసులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన మెద్వెదేవ్ 12 ఏస్‌లు కొట్టాడు. 6వ సీడ్ జానిక్ సిన్నర్ 6-3, 2-6, 6-4, 6-2తో వావ్రింకాపై, 8వ సీడ్ రుబ్లేవ్ 3-6, 6-3, 6-1, 7-5తో ఆర్థర్ కిండర్‌కెంచ్‌పై, 12వ సీడ్ జ్వెరెవ్ 6-7(2), 7-6(8), 6-1, 6-1తో దిమిత్రోవ్‌పై విజయం సాధించారు.
మహిళల సింగిల్స్‌లో ఫామ్‌లో ఉన్న చెక్ భామ కరోలినా ముచోవా యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. 10వ సీడ్ ముచోవా 6-3, 5-7, 6-1తో వాంగ్ గ్జిన్‌యు (చైనా)పై గెలిచింది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ పెగుల 6-4, 4-6, 6-2తో స్విటోలినాను ఓడించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లింది. అయిదో సీడ్ జెబ్యూర్ 5-7, 7-6(5), 6-3తో మరియా బుజ్‌కొవాను ఓడించింది. 9వ సీడ్ వొండ్రుసోవా 6-2, 6-1తో అలెగ్జాండ్రొవాను, 17వ సీడ్ మాడిసన్ కీస్ 5-7, 6-2, 6-2తో సంపొనొవాను ఓడించి తదుపరి రౌండ్‌లో ప్రవేశించింది.
భారత ఆటగాడు రోహన్ బోపన్న పురుషుల డబుల్స్‌లో క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. రౌండ్-16లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 6-4, 6-7(5), 7-6(6)తో బ్రిటన్‌కు చెందిన జూలియన్ క్యాష్-హెన్రీ ప్యాటర్న్ జోడీపై గెలిచింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com