VAIBHAV: చిన్నోడు కాదు.. టీమిండియా చిచ్చరపిడుగు

క్రికెట్ ప్రపంచంలో అరుదుగా కనిపించే అద్భుతాలు కొన్నే. అటువంటి అద్భుతాల్లో తాజాగా చోటు దక్కించుకున్న పేరు వైభవ్ సూర్యవంశీ. వయసు ఇంకా 15 కూడా నిండని ఈ కుర్రాడు, తన బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు… ప్రపంచ క్రికెట్ వర్గాల్లోనూ చర్చకు తెరలేపాడు. చదువుపుస్తకాల మధ్య ఉండాల్సిన వయసులో, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతూ ‘భవిష్యత్తు భారత క్రికెట్ ముఖం ఇతడే’ అనే అభిప్రాయాన్ని బలంగా నిలబెట్టాడు. బిహార్‌కు చెందిన వైభవ్ ప్రయాణం సాధారణం కాదు. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్లో తన ప్రతిభను చాటిన అతడు, 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో కోటీశ్వరుడిగా మారడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో అతడిపై ఆశ్చర్యంతో పాటు అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇంత చిన్న వయసులో ఐపీఎల్ స్థాయి పోటీలో నిలబడగలడా అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత, ఆ అనుమానాలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. అనుభవజ్ఞులైన బౌలర్లను ఎదుర్కొంటూ, ధైర్యంగా ఆడిన అతడి ఇన్నింగ్స్‌లు అభిమానులను కట్టిపడేశాయి. ముఖ్యంగా ఓపెనర్‌గా దూకుడు చూపిస్తూ వేగంగా పరుగులు సాధించడంలో అతడు అసాధారణ ప్రతిభ కనబరిచాడు.
ఈ నేపథ్యంతో అండర్-19 ప్రపంచకప్‌లో వైభవ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. గ్రూప్ దశలో అతడు నిలకడగా పరుగులు చేసినప్పటికీ, అభిమానులు అతడి నుంచి మరింత ఆశించారు. సెమీఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడినా, నిజమైన ప్రకంపనలు మాత్రం ఫైనల్లోనే వచ్చాయి. టైటిల్ మ్యాచ్‌లో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ టోర్నమెంట్కే హైలైట్‌గా నిలిచింది. అద్భుతమైన టైమింగ్, చక్కటి ఫుట్‌వర్క్, అపారమైన శక్తి… ఈ మూడింటి కలయికతో అతడు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తక్కువ ఓవర్లలోనే భారీ స్కోరు సాధించడం ద్వారా, ఆధునిక క్రికెట్లో బ్యాటింగ్ ఎలా మారిందో మరోసారి నిరూపించాడు.
రికార్డుల పుస్తకాన్ని తిప్పిరాశాడు
ఫైనల్లో అతడు బాదిన ఫోర్లు, సిక్సర్లు రికార్డుల పుస్తకాన్ని తిరగరాశాయి. యూత్ వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, బౌండరీల ద్వారానే ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. చిన్న వయసులో మెరిసి ఆపై కనుమరుగైన ఆటగాళ్లు చాలామందే ఉన్నారు. కానీ వైభవ్ ఆటలో కనిపిస్తున్న నిలకడ, పరిస్థితులకు తగ్గట్టు మారే సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. బౌలర్లు వేసే ఉచ్చులను తెలివిగా ఎదుర్కొంటూ, తన బలాన్ని బలహీనతగా మారనీయకుండా జాగ్రత్తపడుతున్నాడు. తాజా ప్రదర్శనతో అతడు సీనియర్ జట్టుకు అర్హుడనే వాదనకు బలం చేకూరింది. ఇక ముందు రోజుల్లో భారత జట్టులో అతడికి చోటు దక్కడం కాలప్రశ్న మాత్రమే. వయసుతో సంబంధం లేకుండా, ప్రతిభకు వేదిక ఇస్తే ఏ స్థాయికి ఎదగవచ్చో చూపిస్తున్న ఉదాహరణగా వైభవ్ సూర్యవంశీ నిలుస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
