VAIBHAV: ప్రపంచ క్రికెట్లో వైభవ్ ప్రకంపనలు

క్రికెట్ హిస్టరీలో వైభవ్ సూర్యవంశీ అద్భుతం అంటూ దిగ్గజ క్రికెటర్స్ కితాబిస్తున్నారు. భారత క్రికెట్ కు స్టార్ క్రికెటర్ అంటూ 14 ఏళ్ల సూర్యవంశీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీ అరంగేట్రంలో అరుణాచల్ ప్రదేశ్‌పై 84 బంతుల్లో 190 పరుగులు చేసి బిహార్ యువ బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో విఫలమైన కొద్ది రోజుల తర్వాత ఆడిన ఈ ఇన్నింగ్స్, సూర్యవంశీని త్వరలో సీనియర్ భారత జట్టులో చేర్చాలా వద్దా అనే చర్చకు దారితీసింది. వైభవ్ విధ్వంసక బ్యాటింగ్ కారణంగా, బీహార్ జట్టు 6 వికెట్లకు 574 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు. ఈ ప్రదర్శన అభిమానులను, క్రికెట్ నిపుణులను, మాజీ ఆటగాళ్లను ఆశ్చర్యపరిచింది. సీనియర్ దేశవాళీ క్రికెట్లో ఇంత చిన్న వయస్సులో ఇంత ఆధిపత్యం చాలా అరుదు. వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ సాధించి, పురుషుల లిస్ట్ ఎ క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. వైభవ్ అక్కడితో ఆగలేదు. 59 బంతుల్లో 150 పరుగులు సాధించి, పురుషుల లిస్ట్ ఎ క్రికెట్లో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును నెలకొల్పాడు. గతంలో, ఈ రికార్డు ఎబి డివిలియర్స్ పేరిట ఉంది. వైభవ్ 84 బంతుల్లో 190 పరుగులకు అవుట్ అయ్యే సమయానికి, 16 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. వైభవ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న వారిలో కాంగ్రెస్ ఎంపీ, క్రికెట్ ఔత్సాహికుడు శశి థరూర్ కూడా ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైభవ్ సూర్యవంశీని సచిన్ టెండూల్కర్‌తో పోల్చి, చివరిసారిగా 14 ఏళ్ల బాలుడు ఇంత అసాధారణ ప్రతిభను ప్రదర్శించినది సచిన్ అని రాసుకొచ్చారు.
16 ఫోర్లు, 15 సిక్సర్లు
విజయ్ హజారే ట్రోఫీలో బీహార్ జట్టు అరుణాచల్ ప్రదేశ్‌పై రికార్డు విజయం సాధించింది. రాంచీలో జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్ 397 పరుగుల తేడాతో గెలిచి విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బీహార్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. ఇక బీహార్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలాగే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకపడాడ్డు. వైభవ్ కేవలం 84 బంతుల్లో 16 ఫోర్లు, 15 సిక్సర్ల ధనాధన్ ఇన్నింగ్స్‌తో 190 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న వైభవ్.. మంగళ్ మహ్రూర్ (33)తో కలిసి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించాడు. ఆ తర్వాత పియూష్ సింగ్ (77), అయూష్ లోహరుకా (116), కెప్టెన్ సకిబుల్ గనీ (128*) అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. అరుణాచల్ బౌలర్లలో టీఎన్ఆర్ మోహిత్ 2 వికెట్లు, టెచి నేరి 2 వికెట్లు తీశారు. మిబోమ్ మోసు కేవలం 9 ఓవర్లలో 116 పరుగులు ఇచ్చాడు. రికార్డు 575 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ కుప్పకూలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

