Vinesh Phogat: సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Vinesh Phogat: సస్పెన్స్  కొనసాగుతూనే ఉంది.
X
ఈ నెల 16కు వాయిదా వేసిన కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు మరోసారి వాయిది పడింది. ఆగష్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తెలిపింది. వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇస్తారా లేదా అనేది స్పోర్ట్స్ కోర్టు నిర్ణయించనుంది. కాగా.. దీనిపై ఇప్పటికే విచారణ పూర్తయింది. ముందుగా ఆగస్టు 10న నిర్ణయం వెలువడుతుందని అనుకున్నప్పటికీ.. ఆగస్టు 13కి వాయిదా వేశారు. కాగా.. ఈరోజు తీర్పు వస్తుందని భారతదేశ ప్రజలు ఉత్కంఠతో చూస్తుండగా.. ఈ సస్పెన్స్ అలానే కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 16న తీర్పు వెలువడనుంది.

కాగా.. రెజ్లింగ్ ఫైనల్ కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో IOC ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. ఈ క్రమంలో.. తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ అప్పీల్ చేసింది. ఇదిలా ఉంటే.. వినేష్‌కు క్రీడా రంగంలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. వీరిలో జపాన్‌కు చెందిన ఒలింపిక్ ఛాంపియన్ రెజ్లర్ హిగుచి రే, అమెరికా రెజ్లర్ జోర్డాన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంటి కొందరు దిగ్గజాలు ఆమెకు సపోర్ట్ చేశారు. మరి స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఈ కేసులో వినేశ్ తరఫున వాదించిన ఇద్దరు సీనియర్ న్యాయవాదులలో ఒకరైన విదుష్పత్ సింఘానియా మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది మాకు చాలా కష్టమైన పని. ఎందుకంటే మా అభిప్రాయాలను సిద్ధం చేయడానికి, వాటిని కాస్‌ ముందుంచడానికి మాకు చాలా తక్కువ సమయం దొరికింది. కానీ, మేము కష్టపడి పనిచేసి వినేశ్ కోసం పోరాడటానికి సన్నద్ధమయ్యాం. సాధారణంగా కాస్‌ 24 గంటల్లో తీర్పు ఇస్తుంది. ఈసారి వారు తీర్పు గడువును ఒకటి కంటే ఎక్కువసార్లు పొడిగించారు. నిర్ణయం భారత్‌కు అనుకూలంగా వస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. తీర్పు ఇచ్చే అడ్‌హక్‌ ప్యానెల్ 24 గంటల కాలపరిమితిని కలిగిఉంది. దీన్నిబట్టి ఈ అంశం గురించి ప్యానెల్‌ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది. న్యాయమూర్తి మహిళ అయితే మాకు మరింత మంచిది. గతంలో నేను చాలా కేసులు వాదించాను. ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ. వినేశ్‌ ఫొగాట్ విషయంలో చరిత్రాత్మక తీర్పు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరుతున్నాం. ఇది కొంచెం కష్టమే అయినా ఏదైనా అద్భుతం జరగాలని ఆశిద్దాం. వినేశ్‌కు పతకం దక్కాలని అందరూ ప్రార్థించండి. ఒకవేళ మెడల్ రాకపోయినా ఆమె ఛాంపియనే’’ అని విదుష్పత్ సింఘానియా పేర్కొన్నారు.

తీర్పు వెలువడనున్న నేపథ్యంలో వినేశ్ ఇంకా స్వదేశానికి బయలుదేరలేదు. త్వరలో ఆమె భారత్‌కు వచ్చే అవకాశముంది. సోమవారం తన లగేజీని తీసుకొని ఒలింపిక్‌ క్రీడాగ్రామం నుంచి వినేశ్‌ బయటికి వచ్చేసింది.

Tags

Next Story