Yogeshwar dutt: వినేష్ .. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే

Yogeshwar dutt: వినేష్ .. దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే
X
అనర్హత వేటుకు ఫొగాట్ బాధ్యత తీసుకోవాల్సిందన్న యోగేశ్వర్

పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతకు గురైన వినేశ్ ఫొగాట్ దేశానికి క్షమాపణలు చెప్పాలని లండన్ ఒలింపిక్ విజేత యోగేశ్వర్ దత్ అన్నాడు. ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. ఆమెకు యావత్ భారత్ అండగా నిలిచింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో యోగేశ్వర్ దత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

పారిస్ ఒలింపిక్స్ అనర్హత వేటుకు సంబంధించి వినేశ్ ఫొగాట్ బాధ్యత తీసుకోవాల్సిందని అన్నారు. బాధ్యత తీసుకోకపోగా తన అనర్హతకు ఇతరులపై నిందలు వేయడం సరికాదన్నారు. తాను కనుక ఇలా అనర్హతకు గురై ఉంటే దేశానికి క్షమాపణలు చెప్పేవాడినన్నారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆమె వ్యవహరించిన తీరు పట్ల యోగేశ్వర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒలింపిక్స్ విషయంలో తనపై కుట్ర జరిగిందన్న ఆమె వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీని విమర్శించే వరకు కూడా వెళ్లారని మండిపడ్డారు. గ్రాము కంటే కాస్త ఎక్కువగా ఉన్నా అనర్హత వేటు వేస్తారనే విషయం ప్రతి ఆటగాడికి తెలుసునన్నారు. ఫైనల్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు దేశం మద్దతుగా నిలిచిందన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె నిరాశతో భారత్‌కు వచ్చేశారు. అనంతరం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆమె రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అంతే కాంగ్రెస్‌లో చేరి.. జులానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

Tags

Next Story