Virat Kohli: రాయుడుని తప్పించింది కోహ్లీనే: ఉతప్ప

వన్డే వరల్డ్ కప్-2019కు అంబటి రాయుడును ఎంపిక చేయకపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ముఖ్యంగా అంబటి రాయుడును జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఫామ్‌లో ఉన్న తెలుగు ఆటగాడు అంబటి రాయుడిని తప్పించి.. మూడు రకాలుగా ఉపయోగపడతాడని పేర్కొంటూ.. విజయ్ శంకర్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. దీనిపై రాయుడు అప్పట్లోనే తన నిరసన వ్యక్తం చేశాడు. అయితే నాటి వివాదంపై టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో రాయుడికి చోటు దక్కకపోవడానికి అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమని వ్యాఖ్యానించాడు. కోహ్లీకి రాయుడంటే.. ఇష్టం లేదని, అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు.
కోహ్లీ చేసింది న్యాయం కాదు
అందరికీ ప్రాధాన్యతలు ఉంటాయని తాను అంగీకరిస్తానని.. కానీ, ఓ ఆటగాడికి తలుపులు మూసివేయకూడదని రాబిన్ ఊతప్ప అన్నాడు. రాయుడుకు వరల్డ్ కప్ జెర్సీలు, వరల్డ్ కప్ కిట్ బ్యాగ్.. అన్నీ అతని ఇంటికి పంపించారని... ఆ సమయంలో ఏ ప్లేయర్ అయినా తాను ప్రపంచ కప్ ఆడతాడనే అనుకుంటాడని వెల్లడించాడు. కానీ, కోహ్లీ రాయుడును పక్కన పెట్టాడని... ఇది న్యాయం కాదని ఆరోపణలు చేశాడు. కాగా, 2019 వరల్డ్ కప్‌కు రాయుడు బదులు విజయ్ శంకర్‌ను తీసుకోగా అతన్ని దారుణంగా విఫలమయ్యాడు. ప్రపంచకప్ జట్టు ఎంపికపై అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జట్టు ఎంపికలో సెలెక్టర్లతోపాటు కెప్టెన్ కోహ్లీ కూడా భాగమయ్యాడని చెప్పాడు.
ఎంఎస్కే ప్రసాద్ ఏం అన్నారంటే..?
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో తనకు అవకాశం రాకపోవడంపై సెలక్షన్ కమిటీ కారణమని అంబటి రాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఎంఎస్కే ప్రసాద్ అప్పుడు ఛైర్మన్‌గా ఉన్నారని.. తనకు అన్యాయం జరిగిందని రాయుడు వెల్లడించాడు. తన పొరపాటు ఏమీ లేదని.. అపార్థం చేసుకోవడం వల్లే రాయుడు అలా వ్యాఖ్యానించి ఉండొచ్చని ఎంఎస్కే తెలిపాడు. సెలక్టర్లతోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. 2019 వన్డే ప్రపంచ కప్ కోసం తుది జట్టును ఎంపిక చేయడంలో ఇతర సెలెక్టర్లు, కెప్టెన్ కోహ్లీ కూడా పాత్ర పోషించారని MSK పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com