Afro Asia Cup: ఒకే టీమ్‌లో రోహిత్, కోహ్లీ, బాబర్, రిజ్వాన్‌..

Afro Asia Cup: ఒకే టీమ్‌లో రోహిత్, కోహ్లీ, బాబర్, రిజ్వాన్‌..
క్రికెట్ ఫ్యాన్స్‌కు నిజంగానే పండగ

భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, పాక్ సార‌థి బాబ‌ర్ ఆజామ్ క‌లిసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును ఓడించేందుకు వ్యూహాలు ర‌చిస్తే? స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ రిజ్వాన్‌, షహీన్ అఫ్రిది తదితర ఆటగాళ్లు ఒకే టీమ్‌లో క‌నిపిస్తే ఆ కిక్కే వేరు. అయితే, త్వ‌ర‌లోనే ఉపఖండంలోని చాలా మంది అభిమానుల కల నిజమయ్యే అవ‌కాశం ఉంది. ఒకే జట్టు తరఫున భార‌త్‌, పాకిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్లు ఆడే ఛాన్స్ ఉంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆఫ్రో-ఆసియా కప్ ఇలా ఇరు దేశాల‌ ఆటగాళ్లు ఒకే జట్టులో కలిసి ఆడేందుకు వీలు కల్పిస్తుంది.

ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ సమోద్ దామోదర్, తదుపరి ఐసీసీ బాస్ జైషా అధ్యక్షతన 2025లో ఆఫ్రో-ఆసియన్ క‌ప్‌ను పునరుద్ధరించవచ్చని వెల్లడించారు. 35 ఏళ్ల జై షా ఇటీవ‌ల ఐసీసీ ఛైర్మ‌న్‌గా ఎన్నికైన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 01 నుంచి ఆయ‌న బాధ్య‌త‌లు చేపట్టబోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఈ టోర్నీని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని దామోద‌ర్ పేర్కొన్నారు. ఈ విష‌య‌మై ఇంత‌కుముందు వారి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

2005, 2007లో ఆఫ్రో- ఆసియా కప్‌ పేరిట ఓ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించేవారు. ఈ టోర్నీలో ఆసియా దేశాల క్రికెటర్లు ఒక జట్టుగా, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి తలపడేవారు. ఆసియా జ‌ట్టులో భారత్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన ఆటగాళ్లు ఉంటారు. అలాగే ఆఫ్రికన్ జ‌ట్టు త‌ర‌ఫున దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యాల దేశాల‌ క్రికెటర్లు పాల్గొంటారు.

అప్పట్లో ఆసియా జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇంజమామ్‌ ఉల్ హక్‌, జహీర్ ఖాన్‌, షోయబ్ అక్తర్‌, షాహిద్‌ అఫ్రిదీ ఆడారు. అటు షాన్ పొలాక్, జాక్వెస్ కలిస్, టాటెండా తైబు వంటి ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఒకవేళ ఈ టోర్నీ మళ్లీ జరిగితే భారత్, పాకిస్థాన్‌ ఆటగాళ్ల‌ను ఒకే జట్టులో చూడవచ్చు.

Tags

Next Story