Rani Rampal's Journey: ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్న హాకీ ప్లేయర్.. రాణి రాంపాల్ జర్నీ

Rani Rampals Journey: ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకున్న హాకీ ప్లేయర్.. రాణి రాంపాల్ జర్నీ
ఆట మీద ఇష్టంతో ఆటంకాలెన్ని ఎదురైనా అధిగమించాలని ఆనాడే అనుకుంది.

Rani Rampal's Journey: ఆట మీద ఇష్టంతో ఆటంకాలెన్ని ఎదురైనా అధిగమించాలని ఆనాడే అనుకుంది. అందుకే ఈ రోజు దేశం కోసం పతకాన్ని తీసుకొచ్చేందుకు హాకీ స్టిక్‌తో బరిలోకి దిగింది. ఒలింపిక్స్ పతకాన్ని చేజిక్కించుకునేందుకు సాయ శక్తులా ప్రయత్నిస్తోంది రాణి రాంపాల్. ఆమె జర్నీ అంత ఈజీగా సాగలేదు. అయినా పట్టువదల్లేదు.. పతకం సాధించే వరకు నిద్రపోనంది.

భారత మహిళల హాకీ జట్టు మొదటిసారి ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. రాణి రాంపాల్ ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో మొట్టమొదటి పతకం సాధించడానికి భారతదేశానికి నాయకత్వం వహిస్తుంది.

భారత మహిళల హాకీ జట్టు సోమవారం చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో మొదటిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. టోక్యో గేమ్స్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రపంచ నెం .2 ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించిన భారత్.. అర్జెంటీనాను చివరి నాలుగు దశల్లోకి నెట్టింది. జట్టు యొక్క చారిత్రాత్మక ప్రదర్శనకు నాయకత్వం వహించినది భారతదేశపు టాలిస్మానిక్ నాయకురాలు రాణి రాంపాల్.

ఈ దశకు చేరుకున్న రాణి రాంపాల్ జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. ఎన్నో ఆటంకాలు, మరెన్నో అవరోధాలు.. అన్నింటినీ అధిగమించి అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. చరిత్రను తిరగరాసే గడియ కోసం ఎదురు చూస్తోంది. 2010 ప్రపంచకప్ కోసం 15 సంవత్సరాల వయస్సులో జాతీయ జట్టులో అతి పిన్న వయస్కురాలు కావడం నుండి ప్రతిష్టాత్మక 'వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్న మొదటి ప్రపంచ హాకీ ప్లేయర్‌గా రాణి రాంపాల్ జీవిత చరిత్ర తన తోటివారికి ఆదర్శం. ఇప్పుడు ఆమె ఒలింపిక్స్‌లో మహిళల హాకీ జట్టుకు నాయకత్వం వహిస్తూ పతకం సాధించి దేశానికి గర్వకారణం కావాలనుకుంటోంది.

రాణి రాంపాల్ తన స్ఫూర్తిదాయకమైన కథను 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఇన్‌స్టాగ్రామ్ పేజీతో పంచుకున్నారు మరియు ఆమె ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. నాన్న బండి లాగి రోజుకు రూ.80లు సంపాదిస్తే.. అమ్మ ఇళ్లలో పని చేసి కుటుంబాన్ని పోషించేది. ఇల్లు గడవడమే కష్టమంటే ఆట పేరుతో అది ఇదీ కొనమని ఎలా అడుగుతాను. హాకీ కోచింగ్ ఇంటికి దగ్గరలో జరుగుతుంటే రోజూ వెళ్లి చూసేదాన్ని. నేనూ నేర్చుకుంటాను అని కోచ్‌ని అడిగితే బలంగా లేవు.. బాగా తినాలి అన్నారు. విరిగిన స్టిక్‌లు ఇవ్వండి ప్రాక్టీస్ చేసుకుంటాను అన్నాను. వాటితోనే ఆడుతూ ఎలాగైనా శిక్షణ తీసుకోవాలి, పేరు తెచ్చుకోవాలి.. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని గట్టెక్కించాలి అని కలలు కన్నాను అని చెబుతుంది రాంపాల్.

రాణి ఆసక్తిని గమనించిన కోచ్ సరే కోర్టుకు వచ్చి ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఆనందంతో ఎగిరి గంతేసిన రాణికి కోచ్ చెప్పిన మాటతో మళ్లీ నిరాసే ఎదురయ్యింది. రోజు అరలీటర్ పాలు తీసుకుని రావాలి ప్రాక్టీస్ మధ్యలో తాగడానికి అని చెప్పారు. కానీ రాణీకి తల్లి 200 ఎమ్ఎల్ పాలు మాత్రమే ఇవ్వగలిగేది. మిగిలిన వెలితిని నీటితో నింపి ఆడేందుకు వెళ్లేది. ఇంట్లో గడియారం కూడా లేదు. అమ్మే ఆకాశాన్ని చూసి రాణిని లేపి పంపించేది. ఇంట్లో కరెంట్ లేదు. ఇక ఫ్యాను, లైటు ఎక్కడివి. చెవుల్లో దోమలు చేసే సొదతోనే తెల్లవారి పోయేది.

అయినా ఆట మీద మక్కువతో అమ్మ ఇచ్చిన పాల బాటిల్ తీసుకుని పరిగెత్తేది. సర్క్ వేసుకుని ఆడటాన్ని అమ్మానాన్న అంగీకరించలేదు. అయినా ఒప్పించింది. నేను ఓడిపోతే మీరు చెప్పినట్లు వింటాను అని ముందుగానే ప్రామిస్ చేసింది. ఆటలో తాను కనబరిచే ప్రతిభ చూసి కోచ్ ఆమెకు హాకీ కిట్టు, షూస్ కొనిచ్చారు. ఆహార అవసరాలు కూడా అతడే చూస్తూ ఆటలో రాణించేందుకు శిక్షణ ఇచ్చారు. ఒక్క రోజు కూడా ప్రాక్టీస్‌కి వెళ్లకుండా ఉండేది కాదు. అంత ఇష్టం ఆట అంటే.

"ఆపై 2017 లో, నేను నా కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాను, ఇల్లు కొన్నాను. ఆ సమయంలో అమ్మా నాన్న ఆనందానికి అవధులు లేవు. ఆ సంతోష సమయంలో ఒకరినొకరు గట్టిగా పట్టుకుని ఏడ్చాము. ఈ సంవత్సరం ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్నాను. బంగారు పతకం సాధించేందుకు కృషి చేస్తున్నాను అని చెబుతోంది రాణి.

స్వర్ణానికి చేరువలో ఉన్న రాణి.. పతకం సాధించడంలో భారత్ విజయానికి అడుగు దూరంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story