AUSvsPAK: చితక్కొట్టి.. శతక్కొట్టారు

AUSvsPAK: చితక్కొట్టి.. శతక్కొట్టారు
X
పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం... డేవిడ్ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ సెంచరీలు

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసి ఈ మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ బౌలింగ్ తీసుకున్నాడు. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్షల్‌ విధ్వంసంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ ఆరంభంలో లక్ష్యం దిశగా పయనించింది. కానీ ఆసిస్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయంతో ఆస్ట్రేలియా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌ అయిదో స్థానానికి పడిపోయింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు దిమ్మతిరిగే ఆరంభాన్ని ఇచ్చారు. డేవిడ్‌ వార్నర్‌ 140 బంతులుఎదుర్కొని 168 పరుగులు చేశాడు. 108 బంతులు ఎదుర్కొన్న మిచెల్‌ మార్ష్‌ 10 భారీ సిక్సులు, 9 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. హరీస్‌ రౌఫ్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో 24 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సుతో 24 పరుగులు వచ్చాయి. అప్పటినుంచి ఆసిస్‌ బ్యాటింగ్‌ జెట్‌ స్పీడ్‌తో సాగింది. క్రీజులో కాస్త కుదురుకున్నాక విధ్వంసాన్ని మొదలుపెట్టిన ఈ ఇద్దరు ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. 33 ఓవర్లపాటు వికెట్‌ పడకుండా బ్యాటింగ్‌ చేసి తొలి వికెట్‌కు 259 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వరుసగా వికెట్లు పడుతున్నా వార్నర్‌ మాత్రం పోరాటం ఆపలేదు. డేవిడ్‌ వార్నర్‌ 168 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం ఆసిస్‌ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయాలన్న ఉద్దేశంతో వికెట్లు పారేసుకున్నారు. దీంతో 400 పరుగులు దాటుతుందన్న ఆస్ట్రేలియా.... 367 పరుగులకే పరిమితమైంది.

368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు కూడా మంచి ఆరంభం దక్కింది. శ్రీలంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆత్మ విశ్వాసంతో ఉన్న పాక్‌... లక్ష్యాన్ని ఛేదించే దిశగా తొలి అడుగు బలంగా వేసింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమాముల్‌ హక్‌ అర్ధ సెంచరీలతో తొలి వికెట్‌కు 134 పరుగులు జోడించారు. షఫీక్‌ 64, ఇమాముల్ హక్‌ 70 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కూడా పాక్‌ లక్ష్యం దిశగా పయనించి మరోసారి చరిత్ర సృష్టించేలా కనిపించింది. కానీ జంపా బౌలింగ్‌కు దిగడంతో పాక్‌ పతనం ప్రారంభమైంది. నాలుగు వికెట్ల నష్టానికి 232 పరుగులతో పటిష్టంగానే ఉన్నట్లు కనిపించిన పాక్‌ తర్వాత వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఆసిస్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాక్ 305 పరుగులకే పరిమితమైంది.

Tags

Next Story