WFI sexual harassment : కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

WFI sexual harassment : కమిటీపై రెజ్లర్ల అసంతృప్తి

తమను సంప్రదించకుండానే లైంగిక వేధింపుల దర్యాప్తు ప్యానల్ ను కేంద్ర ప్రభుత్వం నియమించిందని భారత రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. WFI అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి పై చర్యలు తీసుకోవాలంటూ మూడురోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరహార దీక్ష చేస్తున్నారు భారత స్టార్ రెజ్లర్లు... బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సరితా మోర్, సాక్షి మాలిక్.


దిగ్గజ బాక్సర్ మేరి కోమ్ నేతృత్వంలోని ఐదుగురి కమిటీ శరణ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయనుందని, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) రోజువారి వ్యవహారాలను కూడా కమిటీనే నిర్వహిస్తుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ విషయంపై రెజ్లర్లు పెదవివిరిచారు. తమను సంప్రదించాకే కమిటీని నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు.

"పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు ముందు, మమ్మల్ని సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. మమ్మల్ని సంప్రదించకపోవడం బాధాకరం" అని రెజ్లర్లు ట్వీట్ చేసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, క్రీడా మంత్రి ఠాకూర్ లకు ట్యాగ్ చేశారు.

పర్యవేక్షణ కమిటీలో మేరి కోమ్ తో పాటు, మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ బ్యడ్మింటన్ క్రీడాకారిణి, మిషన్ ఒలంపిక్ సెల్ సభ్యురాలు తృప్తి ముర్గుండే, మాజీ TOPS CEO రాజగోపాలన్, మాజీ ఎస్ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story