WPL: అందరిచూపు ఆ 19 మందిపైనే

హిళా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి జరగబోయే నాలుగో ఎడిషన్ టోర్నమెంట్‌కు సంబంధించిన ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. ఈ మెగా ఆక్షన్ నేడు న్యూఢిల్లీలో జరగనుంది. మొత్తం 73 ఖాళీ స్లాట్లను భర్తీ చేయడానికి 277 మంది ఆటగాళ్లు ఈ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వేలం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.డబ్ల్యూపీఎల్ 2026 వేలం జాబితాలో మొత్తం 277 మంది ప్లేయర్లు ఉన్నారు. ఇందులో భారతీయ ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లు ఇద్దరూ ఉన్నారు. భారతదేశం నుంచి మొత్తం 194 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో జాతీయ జట్టుకు ఆడినవారు (క్యాప్డ్) 52 మంది కాగా, ఇంకా అవకాశం రానివారు (అన్క్యాప్డ్) 142 మంది ఉన్నారు. వీరికి 50 స్లాట్లు కేటాయించారు. ఇక విదేశీ ప్లేయర్లు మొత్తం 83 మంది ఉన్నారు. ఇందులో 66 మంది క్యాప్డ్, 17 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. వీరి కోసం 23 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ఆటగాళ్లకు నిర్ధారించిన అత్యధిక బేస్ ప్రైజ్ రూ.50 లక్షలుగా ఉంది. ఈ అత్యధిక బేస్ ప్రైజ్‌లో ఏకంగా 19 మంది స్టార్ ప్లేయర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరితో పాటు రూ.40 లక్షల బేస్ ప్రైజ్‌తో 11 మంది, రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో 88 మంది ప్లేయర్లు ఉన్నారు. అంటే వేలంలో ఈ టాప్ ప్లేయర్స్ కోసం ఫ్రాంఛైజీల మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది.
శ్రీచరణికి జాక్‌పాట్
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమకు కలిసొచ్చే ఆటగాళ్లను రిటైన్ చేసుకొని అవసరం లేని ఆటగాళ్లను వేలంలోకి వదిలేసాయి. ఈ ఐదు ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ జియో హాట్‌స్టార్ గురువారం వెల్లడించింది. ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. యూపీ ఒకే ఒక్క ప్లేయర్‌ను అంటిపెట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ ఇద్దరు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో తెలుగు తేజం, ప్రపంచకప్ విన్నర్ శ్రీచరణి పంట పండనుంది. గత సీజన్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించిన శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి రిటైన్ చేసుకోలేదు. ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఉండటంతో జెమీమా రోడ్రిగ్స్(రూ.2.2 కోట్లు), షెఫాలీ వర్మ(రూ. 2.2 కోట్లు), నికీ ప్రసాద్(రూ.50 లక్షలు)లను మాత్రమే అంటిపెట్టుకుంది. ఈ ముగ్గురితో పాటు మారిజానే కాప్(రూ.2.2 కోట్లు), అన్నబెల్ సదర్లాండ్(రూ.2.2 కోట్లు)లను తీసుకుంది. దాంతో ఆర్‌టీమ్ అవకాశం కూడా ఢిల్లీకి లేకుండా పోయింది. గత సీజన్లో రూ. 50 లక్షలకు శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయగా..రెండు మ్యాచ్‌ల్లోనే ఆమెకు అవకాశం దక్కింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో శ్రీ చరణి 4 వికెట్లు తీసింది. ఈ ప్రదర్శనతోనే టీమిండియాకు ఆడే అవకాశం అందుకున్న శ్రీచరణి ఏకంగా.. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి ఎంపికైంది. ఈ టోర్నీలో 21 ఏళ్ల శ్రీ చరణి అదరగొట్టింది. లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్రా అమ్మాయి 9 మ్యాచ్‌ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

