WWC: అమ్మాయిల చేతిలోనూ దాయాది చిత్తు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా.. దాయాది దేశంపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 247 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్‌ను 159 పరుగులకు కుప్పకూల్చింది. దీంతో ఈ టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించి.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది.
రాణించిన రిచా ఘోష్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 247 పరుగుల మెరుగైన స్కోరు చేయడం ఊహించనిదే. ఇన్నింగ్స్‌లో చాలా భాగం జోరందులేకపోయిన భారత్.. తక్కువ స్కోరుతోనే సరిపెట్టుకునేలా కనిపించింది. పాక్ బౌలర్లు చక్కని బౌలింగ్‌తో హర్మన్‌ప్రీత్ సేనకు కళ్లెం వేసినట్లేనని అనిపించింది.. కానీ ఆఖర్లో వికెట్‌కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విధ్వంసక బ్యాటింగ్‌తో భారత్ కోలుకుంది. ఆమె ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన (23; 32 బంతుల్లో 4×4), ప్రతీక రావల్ కొన్ని బౌండరీలు బాదినా.. సరిగా స్ట్రైక్‌రొటేట్ చేయలేకపోయారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (19; 34 బంతుల్లో 2×4)తో 39 పరుగులు జోడించింది. క్రీజులో కుదురుకున్నాక, జట్టు స్కోరు 106 వద్ద హర్మన్‌ప్రీత్ ఔటైంది. ఆ తర్వాత కూడా చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించిన హర్లీన్.. జెమీమాతో మరో విలువైన భాగస్వామ్యాన్ని (45) నెలకొల్పింది. భారత్ 33 ఓవర్లలో 151/3తో నిలిచింది.
దీప్తి శర్మ (25; 33 బంతుల్లో 1×4)), స్నేహ్ రాణా (20; 33 బంతుల్లో 2×4) జట్టును ఆదుకున్నారు. భారత్ 46వ ఓవర్లో 203/7తో నిలిచింది. భారత్‌ను నియంత్రించడంలో పాక్ విజయవంతమైనట్లే కనిపించింది. కానీ చివర్లో రిచా ఘోష్.. 20 బంతుల్లో 35 రన్స్ చేసి.. టీమిండియా మెరుగైన స్కోరు సాధించేలా చేసింది. రిచా రెచ్చిపోవడంతో భారత్ ఆఖరి నాలుగు ఓవర్లలో ఎంతో విలువైన 44 పరుగులు రాబట్టింది. అలవోకగా షాట్లు ఆడిన ఆమె.. మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చింది.
సిద్రా ఒంటరి పోరాటం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. భారత బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది. పాక్ మహిళా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్నా వన్ డౌన్ బ్యాటర్ సిద్రా ఆమిన్ (106 బంతుల్లో 81 రన్స్) మాత్రం పోరాటం చేసింది. కానీ ఆమె పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించిందే తప్ప ఒటమిని కాదు. భారత బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్.. 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 3, స్నేహ్ రాణా 2 వికెట్లు తీశారు.
మ్యాచ్‌కు ముందు టాస్ సమయంలో వివాదం తలెత్తింది. ఈ మ్యాచ్‌లో టాస్ వేసే క్రమంలో మ్యాచ్ రిఫరీ వ్యవహార శైలి విమర్శలకు దారి తీసింది. టాస్ విషయంలో పాక్ కెప్టెన్ హెడ్, టెయిల్ రెండూ చెప్పడం వివాదానికి దారి తీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com