WWC: ఆటగాళ్లకు బెదురులేదు..ఆ జట్టుకు ఎదురులేదు

మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో నెగ్గింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఫలితంగా 9 పాయింట్లతో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించిన ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. స్తుతం సెమీస్‌లో మిగిలి ఉన్న 3 స్థానాల కోసం 4 జట్లు రేసులో ఉన్నాయి. 7 జట్లకు ఛాన్స్ ఉన్నా.. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు సెమీస్ చేరడం కష్టమే. ప్రస్తుతం ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్, న్యూజిలాండ్ ఈ నాలుగు జట్ల నుంచి సెమీస్‌కు మూడు జట్లు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సెమీస్ కోసం రసవత్తర పోరు
ప్రస్తుతం ఇంగ్లండ్ 4 మ్యాచ్‌ల్లో 7 పాయింట్లతో ఉంది. మరో మ్యాచ్‌లో గెలిస్తే చాలు ఇంగ్లండ్ కూడా సెమీస్ చేరుతుంది. ఇక సౌతాఫ్రికా 6 పాయింట్లతో 3వ స్థానాంలో కొనసాగుతుంది. ఈ జట్టు సెమీస్ చేరాలంటే రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే చాలు. ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా సెమీస్‌కు చేరొచ్చు. అయితే అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. అదే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గితే నేరుగా సెమీస్ చేరుతుంది. భారత్ విషయానికి వస్తే.. వరుసగా ఎదురైన రెండు ఓటములు టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టాయి. సెమీస్ చేరాలంటే తప్పకుండా 2 మ్యాచ్‌ల్లో నెగ్గాలి. భారత్ తన తదుపరి మ్యాచ్‌ను అక్టోబర్ 19న ఇంగ్లండ్‌తో ఆడనుంది. 23న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో నెగ్గాలి.
ఆస్ట్రేలియా ఏకఛత్రాధిపత్యం
వన్డే ఫార్మాట్లో 12 ప్రపంచకప్‌లు జరిగితే అందులో ఏకంగా ఏడు ఆస్ట్రేలియా సొంతమయ్యాయి. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం గురించి చెప్పడానికి ఇంతకంటే రుజువులేం కావాలి? ఎప్పట్లాగే ఈసారీ కంగారూ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఆ జట్టుకు స్వదేశం, విదేశం అని తేడా ఉండదు. ఎక్కడైనా ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తూనే ఉంటుంది. కాబట్టే ఈసారి ప్రపంచకప్ జరుగుతోంది భారత్‌లో అయినా.. కంగారూల అవకాశాలను ఎవ్వరూ కొట్టిపారేయడం లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫామ్ కూడా బాగుంది కాబట్టి.. కప్పు మీద ఎక్కువ ఆశలే ఉన్నాయి. కానీ భారత్ ఎంత బాగున్నా.. కంగారూల సవాల్‌ను కాచుకుని నిలవడం మీదే కప్పు సొంతమవుతుందా లేదా అన్నది ఆధారపడి ఉంది. ఎందుకంటే కంగారులు ఇప్పటికే సెమీస్ చేరారు. గ్రూప్ దశలో భారత్ భారీ స్కోరు చేసినా విజయం సాధించారు. ఇవన్నీ చూస్తుంటే ఆస్ట్రేలియా మరోసారి కప్పు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు సంబంధించి అటు పురుషుల్లో అయినా, ఇటు మహిళల్లో అయినా వారి ప్రత్యేకతను చాటేది ప్రొఫెషనలిజమే. క్రికెట్ అంటే ఇలా ఆడాలి అనిపించేలా ఉంటుంది వారి ఆటతీరు. పురుషులతో పోలిస్తే మహిళల క్రికెట్లో వేగం ఉండదని, భారీ షాట్లు కొట్టలేరని, వేగంగా బంతులేయలేరని విమర్శించే వాళ్లు కూడా ఆస్ట్రేలియాను చూస్తే అభిప్రాయం మార్చుకుంటారు. పురుషుల క్రికెట్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా దూకుడు ఉంటుంది వారి ఆటలో. కంగారూలకు, మిగతా జట్లకు మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com