Yuvraj Singh: మళ్లీ తండ్రైన యువీ

భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ యువరాజ్‌సింగ్ (Yuvraj Singh) మళ్లీ తండ్రయ్యాడు. అతడి భార్య హజల్ కీచ్(Hazel Keech) ఇటీవలే పండంటి పాపకు జన్మనిచ్చింది. భార్య, కుమారుడు, పాపతో ఉన్న ఫొటోను శుక్రవారం యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. యువీ దంపతులకు 2022 జనవరిలో బాబు (Orian) పుట్టాడు. ఇప్పుడు పాప జన్మించింది. దీంతో తమ కుటుంబం పరిపూర్ణమైందని యువీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హజల్ కీచ్ బాబును చూసుకుంటుండగా చిన్నారి పాపాయిని ఎత్తుకున్న ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నాడు. "నిద్రలేని రాత్రులు ఆనంద ఘడియలుగా మారాయి. యువరాణి ఆరాకు స్వాగతం. ఆమె రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది’’ అని యువీ ఆ ఫొటోకు కామెంట్‌ను జోడించి పోస్ట్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన తానిప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నానని యువీ వెల్లడించాడు.
2016లో నవంబర్ 30న యువరాజ్-హేజిల్‌కీచ్‌కు వివాహం కాగా గతేడాది ఒరియాన్ పుట్టాడు. 2019లో యువీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆల్‌రౌండర్‌గా యూవీ భారత్‌కు ఎన్నో విజయాలు అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2011)లోనూ అద్వితీయ ప్రదర్శన కనబరిచాడు. టీమిండియాకు రెండోసారి ట్రోఫీ దక్కడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. క్యాన్సర్ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడ్డ యువీ కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. తానొక పోరాట యోధుడని నిరూపించుకున్నాడు. మోడల్‌గా, బాలీవుడ్ కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హజల్ కీచ్‌ను యూవీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com