T20 CRICKET: టీమిండియాకు జింబాబ్వే షాక్

టీ 20 ప్రపంచకప్ గెలిచి మంచి ఊపు మీదున్న భారత జట్టుకు జింబాబ్వే దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయిదు మ్యాచుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ 20లో యువ భారత్‌ను ఓడించింది. లో స్కోరింగ్... హై టెన్షన్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత తక్కువ పరుగులకే పరిమితమైన జింబాబ్వే... భారత్‌ను ఆ లక్ష్యాన్ని ఛేదించకుండా అడ్డుకోగలిగింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. అనంతరం ఈ స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా 102 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత జట్టు తడబడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా సారధి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. జింబాబ్వే బ్యాటర్లను భారత స్పిన్నర్లు ఇబ్బంది పెట్టారు. రవి భిష్ణోయ్.. తన స్పిన్ మాయాజాలంతో జింబాబ్వే బ్యాటర్లను చుట్టేశాడు. ఓవర్‌లో ఇన్నోసెంట్ కైనాను అవుట్ చేసి ముఖేశ్‌కుమార్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. ఆరు పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రవి భిష్ణోయ్ మాయా ఆరంభమైంది. 21 పరుగులు చేసిన మాధేవేరే, 22 పరుగులు చేసిన బెన్నెట్‌ను రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో బౌల్డయ్యారు. 51 పరుగులకు జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా 17 పరుగులు, మైర్స్ పరుగులు చేసి పర్వాలేదనిపించారు. టాపార్డర్‌లో ఒకరిద్దరి ఆటగాళ్లు మినహా మిగిలిన బ్యాటర్లందరూ రెండంకెల స్కోరు చేశారు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 115 పరుగులే చేసింది. రవి భిష్ణోయ్ నాలుగు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు.
116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. తొలి ఓవర్‌లోనే తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు.రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, రింకూ సింగ్ 0, ధ్రువ్ జురెల్ ఆరు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఓవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కాసేపు పోరాడాడు. 29 బంతుల్లో 31 పరుగులు చేసిన గిల్‌ను అవుట్ చేసి సికిందర్ రజా కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత కూడా భారత వికెట్ల పతనం కొనసాగింది. రవి భిష్ణోయ్ 9, ఆవేశ్ ఖాన్ 16, ముఖేష్‌కుమార్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా వాషింగ్టన్ సుందర్ పోరాడాడు. చివరి ఓవర్ వరకూ క్రీజులో నిలబడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. 34 బంతుల్లో 27 పరుగులు చేసిన సుందర్ చివరి ఓవర్‌లో అవుట్ కావడంతో టీమిండియా పోరాటం ముగిసింది. దీంతో టీమిండియా 102 పరుగులకే కుప్పకూలి లక్ష్యానికి13 పరుగుల దూరంలోనే ఆగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com