Maths Olympiad: మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో 17 యేళ్ల కుర్రాడి అద్భుత ప్రతిభ

ప్రపంచ యవనికపై బెంగళూరుకు చెందిన విద్యార్థి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. బెంగళూరుకు చెందిన 17 సంవత్సరాల అతుల్ ఎస్ నాదిగ్ ప్రతిష్టాత్మక మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించి అంతర్జాతీయ వేదికపై మ్యాథ్స్‌లో భారత విద్యార్థుల ప్రతిభను ఎలుగెత్తి చాటాడు.
ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 118 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమలోని అత్యద్భుత మ్యాథ్స్ సామర్థ్యాలతో, సత్తా చాటుతూ తమ ప్రతిభా పాటవాలు నిరూపించుకుంటారు. ఈ ఒలంపియాడ్ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవిగా అన్ని దేశాలు భావిస్తూ తమ విద్యార్థులను పోటీలకు పంపుతుంటాయి.
బంగారు పతకం గెలిచిన అనంతరం అతుల్ మాట్లాడుతూ.. బంగారు పతకం సాధించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నాడు. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం. 8వ తరగతిలో పాఠశాలలో బోధించే దాని కన్నా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తెలిసొచ్చిందన్నాడు. మ్యాథ్స్ ఒలంపియాడ్ గురించి తెలుసుకున్నాక లెక్కలపై మక్కువ ఇంకా పెరిగిందన్నాడు. అప్పటి నుంచే ఎక్కువగా నేర్చుకోవడం ప్రారంభించి, సమస్యలు పరిష్కరిస్తూ వచ్చానన్నాడు.
"మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో సమస్యను పరిష్కరించడమే కీలకం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన మ్యాథ్స్ పోటీల్లో వచ్చిన ప్రశ్నలను పరిష్కరించడం కోసం విస్తృతంగా శోధించాను. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించడం కోసం కొన్ని బుక్స్ చదివాను." అని వెల్లడించాడు.
"మ్యాథ్స్ ఒలంపియాడ్‌లో విజయం సాధించాలంటే తార్కికమైన ఆలోచనలతో పాటు, సమస్యలకు నూతన మార్గాల్లో పరిష్కారం చూయించాలి." అని అన్నాడు.
ఒత్తిడిని జయించేందుకు తన మనసును ఆహ్లాదపరిచేందుకు, చెస్ ఆడటం, సంగీతం వినడం, స్నేహితులతో మాట్లాడుతూ ఉంటానని వెల్లడించాడు.
మ్యాథమెటిక్స్‌లో రాణించాలంటే విద్యార్థులు మొదటగా దానిపై ఇష్టం పెంచుకుని లీనమైపోవాలి. భారత్‌లో ఇంజినీర్ లేదా డాక్టర్ కావడంతోనే విజయం వస్తుందని అనుకుంటారన్నాడు. కానీ ఇతర సబ్జెక్టులు ఇన్ఫర్మాటిక్స్, ఆస్ట్రానమీ, ఎర్త్ సైన్సెస్ వంటి వాటిల్లో కూడా ఒలంపియాడ్స్ ఉంటాయనే చాలా తక్కువ మందికే తెలుసన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com