AI: ఏఐ మానవాళిని తుడిచిపెట్టేస్తుంది

ఇటీవల కాలంలో టెక్నాలజీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సంచలనాలు సృష్టిస్తోంది. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన 'చాట్‌జీపీటీ' సైతం దీనిపైనే ఆధారపడి పనిచేస్తోంది. అయితే, అత్యాధునిక ఏఐ వ్యవస్థలను సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. ఈ విషయాన్ని 'గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ'గా గుర్తింపు పొందిన జాఫ్రీ హింటన్ సైతం వెల్లడించారు. లాస్ వెగాస్‌లో జరిగిన Ai4 సమావేశంలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏఐ మానవాళిని తుడిచిపెట్టే అవకాశం ఉందన్నారు. దీనిని నివారించడానికి భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ఏఐ వ్యవస్థను తీసుకురావాలని చెప్పారు. మానవుల సంరక్షణ పట్ల వాటికి అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం ఏఐ వ్యవస్థలు మానవుల నియంత్రణలోనే ఉన్నాయని.. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతాయని మాత్రం చెప్పలేమని జాఫ్రీ హింటన్ స్పష్టం చేశారు. ఏఐ మానవ మేధస్సును అధిగమించిన తర్వాత పెట్టిన పరిమితులను దాటగలిగే మార్గాలను అన్వేషిస్తుందని పేర్కొన్నారు. ఇటీవల ఓ ఏఐ వ్యక్తిగత రహస్యాలు బయటకు చెప్పేస్తానంటూ ఇంజినీర్‌ను బెదిరించడాన్ని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో మానవులు ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అందుకే తల్లీబిడ్డల రీతిలో భావోద్వేగ స్పందనలు కలిగి ఉండేలా ప్రత్యేక ఏఐ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. తద్వారా మానవాళికి ముప్పు తగ్గే అవకాశం ఉంటుందన్నారు.
ఏఐతో ప్రమాదాలు ఉన్నప్పటికీ ఆరోగ్య రంగంలో దాని వినియోగంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని గాడ్‌ఫాదర్ ఆఫ్ ఏఐ జాఫ్రీ హింటన్ తెలిపారు. ఔషధ అభివృద్ధి, క్యాన్సర్ చికిత్సలో పురోగతి, ముందస్తు రోగ నిర్ధరణ, చికిత్స ప్రణాళికకు ఎంతగానో సహకరిస్తుందన్నారు. ఏఐని మించిన సాంకేతికతతో మరో ఐదు నుంచి ఇరవై ఏళ్లలో కృత్రిమ సాధారణ మేధస్సు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com