అసలు కలలు ఎందుకు వస్తాయి? కలల వెనక ఉన్న రహస్యం ఏంటి.?

మనిషి నిద్రిస్తున్న సమయంలో వివిధ రకాల కలలు అనేవి రావడం సహజం. నిజంగా మన కళ్ల ముందే జరుగుతుందా అనేంత ప్రభావవంతంగా వస్తుంటాయి ఈ కలలు. కొన్నిసార్లు కలలో జరిగేవాటికి ప్రతిస్పందిస్తూ నిద్రలోంచి ఉలిక్కిపడి లేస్తుంటారు కొంతమంది. వాస్తవానికింత దగ్గరగా ఉండే ఈ కలలు.. నిద్రించే సమయంలో ఎందుకు వస్తాయి? అసలు కలల వెనకాల ఉన్న రహస్యం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఋగ్వేదంలోని మంత్రపుష్పంలో మానవ హృదయం అమరిక గురించి వర్ణించబడింది. ఈ హృదయంలోనే ఇంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ ఉంటారు. పరమాత్మ ఇచ్చిన ఉనికి వలన.. ఆత్మ యొక్క జ్ఞానం.. మనస్సు, ఇంద్రియాల ద్వారా వెలికి వచ్చి శరీరం అంతా వ్యాపిస్తుంది. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ఈ జ్ఞానం 101 నాడులు ద్వారా శరీరపు చివరి అణువు వరకు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే.. కొన్నిసార్లు జ్ఞానం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా మాత్రమే కాకుండా.. నేరుగా మనస్సు నుండి కూడా ప్రసరించగలగడం.
ఇక్కడ జ్ఞానం.. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా కాకుండా మనస్సు నుండి ప్రసరించగలగడమీ కలలకి మూలం. మీరు మెలుకువగా ఉన్నప్పుడు చేసినవి, చూసినవి అన్ని మీ మనసులో అలానే ఉండిపోతాయి. నిద్రిస్తున్నప్పుడు మీ శరీర అవయవాలు విశ్రాంతి తీసుకున్నా.. ఇంద్రియాలు విశ్రాంతి తీసుకోకపోతే జ్ఞానం నాడుల ద్వారా వెళ్లకుండానే తిరిగి మనసులోకి ప్రవేశించి.. ఆయా ఇంద్రియాలకు సంబంధించిన సంస్కారాలను ప్రేరేపిస్తుంది.
ఇలా ఆయా సంస్కారాలను అడ్డదిడ్డంగా ప్రేరేపించడం వలన చిత్ర విచిత్రమైన కలలు, క్రమ పద్దతిలో స్మృశించడం వలన అర్థవంతమైన కలలు వస్తుంటాయి. నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాల పైన నియంత్రణ ఉండదు కనుక కలలకి అంతు అనేది లేకుండా ఉంటుంది. ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు కూడా పనిచేయదు కాబట్టి.. అప్పుడు ఆత్మ నుంచి భావప్రసారమే ఉండదు. ముందే చెప్పినట్టుగా భావప్రసారమే కలలకి మూలం కాబట్టి.. గాడ నిద్రలో కలల ఊసే ఉండదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com