James Webb Space Telescope: 75వేల కోట్ల టెలిస్కోప్ ధ్వంసం.. గ్రహశకలాలు తగలడంతో..

James Webb Space Telescope: విశ్వంలోనే అతిభారీ టెలిస్కోప్‌గా రికార్డులకెక్కిన జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఐతే విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించేందుకు ప్రయోగించిన ఈ టెలిస్కోప్‌నకు నష్టం వాటిల్లడంతో.. దాని లక్ష్యాలు నెరవేరే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రహశకలం తగలడంతో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పాక్షికంగా ధ్వంసమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జేడబ్ల్యూఎస్‌టీని ప్రయోగించినప్పటి నుంచి దానికి ఆరు మైక్రోమీటోరైట్‌లు తాకినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు.
ఐదు ఉల్కలు చాలా తక్కువ మొత్తంలో నష్టాన్ని కలిగించగా.. ఆరో శకలం కాస్త ఎక్కువ నష్టాన్నే కలిగించిందని పేర్కొన్నారు. ప్రారంభంలో ఇది అంత పెద్దనష్టం కాదని అనుకున్నారు. కానీ అంచనాకు మించి నష్టం జరగడంతో మరింత పరిశోధన జరగాలని భావిస్తున్నారు. ఈనష్టం వల్ల ప్రైమరీ మిర్రర్ రెజల్యూషన్ దెబ్బతినలేదని, సూక్ష్మ ఉల్కలు ఢీకొనడం వల్ల మిర్రర్స్, సన్‌షీల్డ్ నెమ్మదిగా క్షీణిస్తాయని వెబ్‌ను డిజైన్ చేసిన ఇంజినీర్లు భావిస్తున్నారు. మే నెలలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. కొద్ది రోజల క్రితమే అది ఓ అద్భుత చిత్రాన్ని పంపడం శాస్త్రవేత్తలకు ఊరటనిస్తోంది.
దీంతో మరో వాదనా వినిపిస్తోంది. ధ్వంసం ప్రభావం టెలిస్కోప్‌పై పూర్తిస్థాయిలో పడదంటున్నారు. ముఖ్యంగా, ప్యానెల్‌లలో ఒకదానికి మాత్రమే నష్టం జరగడంతో ఇది వెబ్ టెలిస్కోప్ ఇమేజ్-టేకింగ్ సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావం చూపదని వివరిస్తున్నారు. కానీ ధ్వంసం కారణంగా దాని మనుగడపై మాత్రం అనుమానాలు వ్యక్తం చేశారు. టెలిస్కోప్ సామర్థ్యం కొద్దికొద్దిగా క్షీణించవచ్చని అభిప్రాయపడ్డారు. విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ఈటెలిస్కోప్‌ను ప్రయోగించారు.
75వేల కోట్లతో దీన్ని నిర్మించారు. విశ్వాన్ని మరింత లోతుగా పరిశీలించేందుకు, కాలంలో వెనక్కి వెళ్లి చూసేందుకు దీన్ని డిజైన్ చేశారు. రెండు లక్ష్యాలు నిర్దేశించి దీన్ని అంతరిక్షంలోకి పంపారు. 1350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వంలో తొలిసారి మిణుకుమన్న నక్షత్రాలను ఫోటో తీయడం దీని మొదటి లక్ష్యం. ఇతర గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయో లేదో గుర్తించడం రెండో లక్ష్యం. అంచనాలకు అనుగుణంగానే ఈ టెలిస్కోప్ తీసిన తొలి ఫొటో తొలి లక్ష్యాన్ని సాధించగల సామర్థ్యాలను ప్రదర్శించింది. దీని కార్యకలాపాలు 10 సంవత్సరాలపాటు కొనసాగుతాయని భావించినప్పటికీ.. తాజా పరిణామాలతో ఇక ఎన్నాళ్లు ఇది పనిచేస్తుందనేది మిస్టరీగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com