japan: ప్రపంచ వేగం తలదన్నే ఇంటర్నెట్

మెరుపు రైళ్లు, అత్యాధునిక ఎయిర్‌పోర్టులు, భూకంపనిరోధక భవనాల నేపథ్యంలో జపాన్ ఇంకొక అద్భుతాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవను అభివృద్ధి చేసింది. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NICT) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఇంటర్నెట్ గరిష్ఠంగా సెకనుకు 1.02 పెటాబిట్స్ వేగంతో డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలదు. అంటే కేవలం రెప్పపాటు కాలంలోనే నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీ మొత్తం లేదా వికీపీడియా డేటాను పూర్తిగా డౌన్‌లోడ్ చేయవచ్చు.
ఈ స్పీడు అమెరికాలోని సాధారణ ఇంటర్నెట్ కనెక్షన్ కన్నా 3.5 మిలియన్ రెట్లు, భారతదేశ సగటు ఇంటర్నెట్‌తో పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతం కావడం గమనార్హం. ఫొటోనిక్ నెట్‌వర్క్ లాబోరేటరీ, సుమితోమో ఎలక్ట్రిక్ సంస్థలు, యూరోపియన్ పార్ట్‌నర్లతో కలిసి ఈ పరిశోధనను జపాన్ NICT విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ఇంటర్నెట్ సాంకేతికత కోసం ప్రత్యేకమైన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్లు, 19 లూపింగ్ సర్క్యూట్లు (ప్రతి ఒక్కటి 86.1 కిలోమీటర్ల పొడవు) వినియోగించారు. ఈ వ్యవస్థ ద్వారా సెకనుకు 1808 కిలోమీటర్ల దూరం వరకు డేటాను పంపే సామర్థ్యం ఉందని నిపుణులు తెలిపారు. ఇప్పటికే 6జీ నెట్‌వర్క్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఇది భవిష్యత్ టెలికాం రంగానికి కీలక మోడల్‌గా నిలవనుంది. ప్రస్తుతం ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో లేదు. అయితే, ప్రభుత్వాలు, డేటా సెంటర్లు, టెలికాం సంస్థలు ఈ టెక్నాలజీని త్వరలోనే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. జపాన్ శాస్త్రవేత్తల ఈ సాంకేతిక అద్భుతం ప్రపంచ సమాచార వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది పలుకనుంది.
ప్రత్యేకతలు
ఇంటర్నెట్ వేగం – సెకనుకు 1.02 పెటాబిట్స్, అంటే సుమారు 1 కోట్ల జీబీలు ఒక్క సెకనులో డౌన్‌లోడ్ చేయగల శక్తి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో తయారైన ప్రత్యేక నెట్‌వర్క్, ఇందులో 19 లూపింగ్ సర్క్యూట్లు వినియోగించారు. ఒక్కో సర్క్యూట్ పొడవు 86.1 కిలోమీటర్లు, ఇవి కలిపి 1808 కిలోమీటర్ల దూరానికి డేటాను పంపగలవు. 8K వీడియోలు, పెద్ద డేటాబేస్‌లు, క్లౌడ్ సేవలు ఒక్క క్షణంలో అందుబాటులోకి వచ్చే స్థాయి వేగం ఇది. గృహ వినియోగానికి కాకపోయినా, డేటా సెంటర్లు, ప్రభుత్వ టెలికాం వ్యవస్థలు దీనిని వాడేందుకు సిద్ధమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com