కరోనా రాకుండా నిరోధించటంలో 94 శాతం సమర్థత ప్రదర్శించిన మోడెర్నా టీకా

కరోనా రాకుండా నిరోధించటంలో 94 శాతం సమర్థత ప్రదర్శించిన మోడెర్నా టీకా

కరోనా వ్యాధి రాకుండా నిరోధించటంలో తమ టీకా 94 శాతం సమర్థత కనబర్చిందని అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా ఇంక్‌ వెల్లడించింది. ఫైజర్‌ - బయాన్‌టెక్‌ SE టీకా, 90 శాతం ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడైన కొద్దిరోజులకే మోడెర్నా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. తమ టీకాపై మూడో దశ పరీక్షల ఫలితాలను NIH సారధ్యంలోని డేటా సేఫ్టీ మోనిటరింగ్‌ బోర్డు పరిశీలించి ఈ విషయాన్ని నిర్థారించిందని మోడెర్నా ఇంక్‌ వెల్లడించింది. కోవ్‌ స్డడీ పేరుతో చేపట్టిన ఈ పరీక్షలను 30 వేల మంది వలంటీర్లపై నిర్వహించారు. తాజా ఫలితాలతో తాము తయారు చేసిన టీకా కొవిడ్‌-19 ను నిరోధించగలదని శాస్త్రీయంగా నిర్థారణ అయ్యిందని మోడెర్నా ఇంక్‌ సీఈఓ స్టెఫానే బాన్సెల్‌ అన్నారు.

అయితే తాజా ఫలితాల ఆధారంగా తమ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాల్సిందిగా అమెరికా ఔషధ నియంత్రణ సంస్థను కోరనున్నట్లు తెలిపారు. ఇతర దేశాల్లోనూ అనుమతి కోసం USFDA వద్ద దరఖాస్తు చేస్తామన్నారు. పైగా పెద్ద ఎత్తున టీకా తయారీకి సన్నద్ధమవుతున్నట్లు తెలిపార. ఈ ఏడాది అనంతరం అమెరికాలో వినియోగానికి 2 కోట్ల డోసుల టీకా అందించగలమని మోడెర్నా సంస్థ స్పష్టం చేసింది. వచ్చే ఏడాదిలో 50 కోట్ల నుంచి 100 కోట్ల డోసుల టీకా తయారు చేయగలమని వివరించింది. అదే సమయంలో టీకా నిల్వ, పంపిణీ, ప్రజలకు ఇవ్వటం... వంటి అంశాలపై దృష్టి సారించినట్లు తెలిపింది.

అయితే కోల్డ్‌, చైన్‌ పద్ధతిలో ఈ టీకాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. మోడెర్నా టీకా, రిఫ్రిజిరేటర్‌లో 30 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫైజర్‌ టీకాను మాత్రం అత్యంత శీతల పరిస్థితుల్లో నిల్వ చేయాలి. మోడెర్నా, ఫైజర్‌, బయాన్‌ టెక్‌ కొవిడ్‌ టీకాలకు USFDA అత్యవసర వినియోగ అనుమతినిచ్చిన పక్షంలో ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే పరిమితంగా ఈ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 11 సంస్థలకు చెందిన టీకాలు తుది దశ క్లినికల్‌ పరీక్షలకు చేరాయి. ఇందులో నాలుగు టీకాలు అమెరికా కంపెనీలవే ఉన్నాయి.



Tags

Read MoreRead Less
Next Story