అంతరిక్షంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నాసా
అమెరికా పరిశోధనా సంస్థ నాసా.. అంతరిక్షంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అంగారక గ్రహంపై రోవర్ పర్సవరన్స్ ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. అది కూడా అనుకున్న చోట, అనుకున్న సమాయానికి దింపింది. మార్స్ 2020 ప్రాజెక్ట్ లో భాగంగా గతేడాది జులై 30న ప్రారంభమైన ఈ యాత్ర 203 రోజుల పాటు 47.2 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించి శుక్రవారం తెల్లవారుజామున 2.25 గంటలకు అంగారక గ్రహంపై దిగ్విజయంగా ల్యాండ్ అయింది.
సౌర కుటుంబంలో కేవలం అరుణ గ్రహంపై మాత్రమే జీవరాశికి అనువైన పరిస్థితులుండేవని, ఎందుకనో అవి తారు మారయ్యాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఒకప్పుడు పుష్కలంగా నీటితో అలరారిన ఆ గ్రహంపై ఇప్పుడు అందుకు సంబంధించిన ఆనవాళ్లే మిగిలాయి. గ్రహం లోలోపలి పొరల్లో ఇంకా ఎంతో కొంత నీటి జాడ వుండొచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు పర్సవరన్స్‌ను కూడా సరిగ్గా అలాంటి ప్రాంతానే ఎంచుకుని దించారు.
350 కోట్ల సంవత్సరాలక్రితం అతి పెద్ద సరస్సు ఉందని భావించే బిలం అంచుల్లో అది సురక్షితంగా దిగటం శాస్త్రవేత్తల ఘనవిజయమని చెప్పాలి. అది దిగే ప్రాంతానికి శాస్త్రవేత్తలు బోస్నియా–హెర్జెగోవినాలోని ఒక పట్టణం పేరైన 'జెజిరో'గా నామకరణం చేశారు. సరస్సు అని దానర్థం. ఒక పెద్ద స్నానాలతొట్టె ఆకారంలో వున్న ఆ ప్రాంతంలోని రాళ్లలో రహ స్యాలెన్నో దాగివున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాటి రసాయన నిర్మాణాన్ని ఛేదిస్తే కోట్లాది సంవత్సరాలక్రితం ఆ సరస్సు ఎలాంటి పరిస్థితుల్లో అంతరించిపోయిందో అంచనా వేయటానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు.
అరుణగ్రహంపైకి యాత్ర అత్యంత సంక్లిష్టమైనది. దానిపైకి ఇంతవరకూ పంపిన అంతరిక్ష నౌకల్లో 50 శాతం విఫలమయ్యాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు ఈ ఏడు నెలలూ ఊపిరి బిగపట్టి పర్సవరన్స్ గమనాన్ని 24 గంటలూ నిశితంగా పరిశీలిస్తూవచ్చారు. ఎప్పటికప్పుడు అవసరమైన సందేశాలు పంపుతూ అది సజావుగా చేరేలా చర్యలు తీసుకున్నారు. ఇంతవరకూ వివిధ దేశాలు పంపిన రోవర్‌లకన్నా పర్సవరన్స్ చాలా పెద్దది.
ఒక కారు సైజున్న ఈ రోవర్‌కు ఒక మినీ హెలికాప్టర్ అమర్చారు. అక్కడి మట్టి నమూనాలను సేకరించడానికి, వాటిని విశ్లేషించి ఎప్పటికప్పుడు సమాచారం నాసాకు చేరేయడానికి అందులో అత్యంతాధునికమైన ఏడు రకాల ఉపకరణాలున్నాయి. ఫోటోలు తీసేందుకు జూమ్ చేయడానికి వీలుండే ఇరవై 3డీ కెమెరాలు, ఆ రోవర్‌ను తాకుతూ వీచే గాలుల ధ్వనిని, మట్టిని సేకరించటానికి రాళ్లను తొలి చినప్పుడు వెలువడే శబ్దాలను రికార్డు చేసేందుకు మైక్రో ఫోన్‌లు, ఇతర సెన్సర్లు కూడా అమర్చారు.
మార్స్ 2020 ప్రాజెక్టులో పలువురు భారత సంతతి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో కీలకంగా డాక్టర్ స్వాతి మోహన్.. గైడెన్స్, నేవిగేషన్, కంట్రోల్ వ్యవహారాల బృందానికి నాయకత్వం వహించారు. హెలికాప్టర్‌ను డాక్టర్ బాబ్ బలరామ్ రూపొందించారు. రోవర్‌ను నడిపే బృందానికి డాక్టర్ వందనా వర్మ నేతృత్వం వహిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com